* నివేదించిన సీఎస్ మహంతి
* ఉన్నతాధికారుల విభజన, యంత్రాంగం పంపిణీపై నివేదికలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం అఖిల భారత సర్వీసు అధికారులను కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నదీజలాలు, విద్యుత్, సహజవనరులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీల విషయమై ఆయా శాఖల రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న కేంద్రం బుధవారం ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల వివరాలను సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె.మహంతి ఈ వివరాలు అందజేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్, ఐఈఎస్, ఐఐఎస్‌ల వివరాలను కేంద్ర ప్రభుత్వ కీలక శాఖల ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందజేశారు. ఇరు ప్రాంతాల నుంచి ఎంతమంది కేంద్ర సర్వీసు అధికారులున్నారు, ఏయే స్థాయిల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల అధికారులు ఎంతమంది తదితర వివరాలను తెలియజేశారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి ఎస్.కె.సర్కార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో పాటు మరికొందరు కీలక శాఖ కార్యదర్శుల ముందు హాజరైన సీఎస్ రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న ఉన్నతాధికారుల విభజన, పాలనా యంత్రాంగం పంపిణీ అంశాలపై నివేదికలు అందజేశారు. విభజన తర్వాత ఏ ప్రాంతానికి ఎంతమంది వెళ్లాల్సి ఉందో నివేదికలో పొందుపరిచారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 280 మంది ఐఏఎస్‌లు, 258 మంది ఐపీఎస్‌లు, ఇతర కేంద్ర సర్వీసు అధికారులు 300కు పైగా ఉన్నట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన అధికారుల పంపిణీని ఎలా జరపాలన్న దానిపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ భేటీకి ముందు సీఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి, చెక్‌పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై సీఈసీ పలు సూచనలు చేసినట్లు సమాచారం.
కేంద్రానికి ఐఏఎస్, ఐపీఎస్‌ల వివరాలు
Published Thu, Oct 31 2013 2:30 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement