పదో తేదీ వరకు ర్యాలీలు, సభలపై నిషేధం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల పదో తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈనెల ఏడో తేదీన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఏపీ ఎన్జీవోలు బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టడం, అలా నిర్వహిస్తే తాము దాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ఉద్యోగులు, ఓయూ జేఏసీ నాయకులు ప్రకటించడం లాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, డీజీపీ దినేశ్ రెడ్డి, సీపీ అనురాగ్ శర్మ తదితర ఉన్నతాధికారులు శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు.
అలాగే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకంగా సీఎస్ మహంతితో చర్చలు జరిపారు. ఉద్యోగులతో సమావేశం అనంతరం మహంతి మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఉద్యోగులను కోరినట్లు ఆయన తెలిపారు.
సచివాలయం జే బ్లాక్ వద్ద టి.ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టడానికి మాత్రమే అవకాశం ఇచ్చామన్నారు. అలాగే సీమాంధ్ర ఉద్యోగులు అమ్మవారి ఆలయం దగ్గర నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో విధులకు 67 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.