క్లిష్ట సమయంలో బాగా పనిచేశారు
కలెక్టర్లకు మహంతి ప్రశంసలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన.. వరుస ఎన్నికలు వంటి సంక్లిష్ట సమయాల్లో అద్భుతంగా పనిచేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ప్రశంసించారు. ‘అత్యంత క్లిష్టమైన సమయాల్లో కష్టపడి పనిచేసిన మీకు, జిల్లాల అధికార యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ వారిని కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో మహంతి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన విధంగానే కొత్త రాష్ట్రాల ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉద్బోధించారు.
‘ఐఏఎస్‌లకు ప్రాంతీయ పరిధులు లేవు. మీరు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రెండు రాష్ట్రాల ప్రగతి మీ చేతుల్లో ఉంది’ అని అన్నారు. ఈ సదస్సులో భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు పలువురు సీనియర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. విభజన అనంతరం కొత్తలో సమస్యలు ఉండవచ్చని, వాటి పరిష్కారంలో కలెక్టర్లు కీలక భూమిక పోషించాలని కృష్ణారావు సూచించారు.