మొక్కలకు రక్షణ కల్పించాలి
-
హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయండి
-
కలెక్టర్లకు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం
-
జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు నాటుతామని కలెక్టర్ యోగితా రాణా వెల్లడి
ఇందూరు : హరితహారం కార్యక్రమంలో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసి, మొక్కల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌లతో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారంపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, లక్ష్యానికి చేరువలో ఉన్న జిల్లాలను అభినందిస్తూనే, 40–45 శాతమే పూర్తి చేసిన విషయంలో బాగోలేదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. వచ్చే సంవత్సరంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంకా మొక్కలు కావాలని అడిగిన వారికి సరఫరా చేయడానికి తక్కువగా ఉన్న మొక్కలను మార్కెట్‌లో కొనుగోలు చేసి తెప్పించుకోవాలన్నారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తిచేయాలని సూచించారు.
82శాతం పూర్తి : కలెక్టర్
జిల్లాలో 3.35 కోట్ల మొక్కటు నాటే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 82 శాతం 2.76 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ యోగితా రాణా సీఎస్‌కు వివరించారు. మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉన్నామని, అంతే గాక వాటి రక్షణకు, నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే టేకు మొక్కలకు ఉపాధిహామీలో నీటిని అందించడానికి సదుపాయాలు లేనందున రూ.42 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఉపాధిహామీ ద్వార నాటిన మొక్కలకు ముళ్ల కంచె ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షల ట్రీ గార్డులు అవసరమని తెలిపారు. 15 రోజుల్లో ఫెన్సింగ్ పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. లక్ష్యాన్ని మించి మరిన్ని మొక్కలను నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని, రెండవ వారంలో ఇందు కోసం కార్యచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ విశ్వ ప్రసాద్, జేసీ రవీందర్ రెడ్డి, డీఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.