2015 ఉగాది కానుకగా ‘మెట్రో’
సాక్షి,సిటీబ్యూరో: నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో మొదటి దశ పనులను 2015 ఉగాదికి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి హెచ్‌ఎంఆర్ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉన్నందున రద్దీని క్రమబద్దీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా మారిన నగర మెట్రో ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తిచేసేందుకు అధికారులు సహకరించాలన్నారు.
గురువారం సచివాలయంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీలో మెట్రో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పనుల పురోగతిని వివరించారు. సుమారు 72 కిలోమీటర్ల మెట్రో పనుల్లో 35 కిలోమీటర్ల మేర యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 1001 పిల్లర్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని, నాగోల్-మెట్టుగూడ మార్గంలో పిల్లర్లపై పట్టాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు.
దీనిపై మహంతి మాట్లాడుతూ.. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉండాలని సూచించారు. దెబ్బతిన్న రహదారులకు సత్వరం మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.