బ్యాంకు సేవలు.. పల్లెలకు విస్తరించాలి
బ్యాంకులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన
రాష్ట్రానికి నాబార్డు రుణసాయం రూ. 1,25,039 కోట్లు
దేశంలోనే ఇది అత్యధికం
సాక్షి, హైదరాబాద్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా బ్యాంకు సేవలు మరింత విస్తరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సూచించారు. గ్రామసభల తీర్మానం మేరకే రుణాలు ఇవ్వాలని కోరారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. వివిధ బ్యాంకుల, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణ పరపతి లక్ష్యాలపై సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ... 2014-15 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు మన రాష్ట్రానికి రూ. 1,25,039 కోట్ల రుణ సాయం అందించడం హర్షణీయమన్నారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయాధారిత రంగాల అభ్యున్నతికే ఈ రుణాలు చేరినప్పుడే గ్రామీణాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని, వీరిలో అత్యధికులు విద్యావంతులు, మహిళలు ఉన్నారని, రుణాల మంజురులో వీరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 250 ప్రాథమిక సహకార గ్రామీణ బ్యాంకులకు, 14 జిల్లా సహకార గ్రామీణ బ్యాంకులకు నాబార్డు రూ.146 కోట్లు అందించిందని చెప్పారు.
రాష్ట్రంలో పేద రైతులకు రుణ పరపతి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికీ చాలామంది ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారని ఆర్‌బీఐ ప్రాంతీయ డెరైక్టర్ కెఆర్ దాస్ తెలిపారు.
రుణాల మంజూరులో కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయని, దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉందని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు మన్మోహన్‌సింగ్, డి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నాబార్డు సీజీఎం జీజీ మమెమ్ నాబార్డు పురోగతిని సమావేశం ముందుంచారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు నాబార్డు రూ.1,25,039 కోట్ల ఆర్థిక తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రధాన రంగాలకు వీటిని వెచ్చిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14.58 శాతం అధికం. పంట రుణాల కింద రూ. 68,953 కోట్లు, వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు రూ. 14,585 కోట్లు, అతి సూక్ష్మ, సూక్ష్మ, మధ్య తరగతి (ఎంఎస్‌ఎంఈ) విభాగానికి రూ. 12,529 కోట్ల రుణాలు అవసరమని అంచనా వేశారు.
రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగులు అవసరమని గుర్తించారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.