గ్లోబల్ బ్యాంకులతో పోలిస్తే భారతీయ బ్యాంకులు ఐటీ సర్వీసులకు తక్కువ ఖర్చు చేస్తున్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకులు సాధారణంగా తమ ఆదాయంలో 7-9% వరకు ఐటీ ఖర్చులు చేస్తుండగా, భారతీయ బ్యాంకులు 5 శాతమే కేటాయిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘ది పోస్టర్ చైల్డ్’ నివేదికలో వివరాల ప్రకారం..2026 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు, రుణాలు మొత్తం 75 శాతం డిజిటల్ రూపంలో జరుగుతాయి. థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 25% కొత్త డిజిటల్ ఖాతాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం బ్యాంకులకు సమకూరే మొత్తం ఆదాయంలో ‘చేంజ్ ది బ్యాంక్ (సీటీబీ)’తో పోలిస్తే దాదాపు 80% ఐటీ బడ్జెట్ ‘రన్ ది బ్యాంక్ (ఆర్‌టీబీ)’ కోసం ఖర్చు చేస్తున్నారు. భారతీయ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ఐటీ కేటాయింపులు తగ్గుతున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మాత్రం బ్యాంకింగ్ ఐటీ సేవల అప్‌డేట్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.
సుమారు 10 బిలియన్ డాలర్ల(రూ.83 వేలకోట్లు) కంటే ఎక్కువ నికర ఆదాయాన్ని ఆర్జించే గ్లోబల్ బ్యాంక్‌లు 9.1% ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. అదే భారతీయ బ్యాంకులు వాటి ఆదాయంలో కేవలం 3.2% మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8 వేలకోట్లు) నుంచి రూ.83 వేలకోట్లు మధ్య నికర ఆదాయాన్ని సంపాదించే బ్యాంకులు సరాసరి 7.2 శాతం ఐటీ బడ్జెట్‌కు ఖర్చు చేస్తున్నాయి. భారతీయ బ్యాంక్‌ల్లో ఈ వాటా 3 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: టాటా స్టీల్..2,800 ఉద్యోగాల కోత
2022, 2023లో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలో 40,000 కంటే ఎక్కువ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలంటే మరింత సమర్థమైన ఐటీ సేవలందించాలి. దాంతో ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏటా యూపీఐ, నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. మార్కెట్‌లో కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవాలంటే బ్యాంకులు అవి అందించే ఐటీ సర్వీసులను అప్‌డేట్ చేసుకోవాలని నివేదిక సూచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment