సోమవారం ఉదయం విమానంలో తీసుకెళ్లనున్న ప్రత్యేకాధికారి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013కు సంబంధించి రాష్ట్ర శాసనమండలి, శాసనసభలో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి సోమవారం ఢిల్లీకి పంపించనున్నారు. ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, సారాంశం, చర్చల రికార్డు ప్రతులు, ప్రతిపాదిత సవరణలు, సూచనలను క్రోడీకరించి ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసే పని ముగింపు దశకు వచ్చింది. ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో క్రోడీకరించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారానే కేంద్ర హోం శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నివేదిక శుక్రవారం సాయంత్రమే సీఎస్ పి.కె.మహంతికి చేరింది. ఉభయసభల అభిప్రాయాలను సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో హస్తినకు పంపాలని ఆయన నిర్ణయించారు.
చర్చల రికార్డులపై ఏం చేయాలనే అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రధానాంశాలపై సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా సారాంశాలను సాధారణ పరిపాలన శాఖ తయారు చేయనుంది. ప్రభుత్వ తీర్మానం ప్రతిని, సభ్యుల సవరణలను కూడా నివేదికకు జత చేయనున్నారు. మొత్తం కలిపి 400 నుంచి 500 పేజీల బండిల్ తయారవుతుందని సమాచారం. బిల్లును, సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సభలో చర్చ ముగిసిన మూడు రోజుల్లోగా పంపించాల్సిందిగా రాష్ట్రపతి పేర్కొనడం తెలిసిందే. మూడు రోజుల గడువు ఆదివారంతో ముగియనుంది. ఆ రోజు సెలవైనందున సోమవారం ఉదయమే పంపనున్నారు.
ఎల్లుండి హస్తినకు బిల్లు చర్చల సారాంశం
Published Sat, Feb 1 2014 2:09 AM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM
Advertisement