state legislature
-
వీడిన సస్పెన్స్.. మణిపూర్ సీఎంగా మళ్లీ బీరెన్ సింగ్
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం అపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న బీరెన్‌సింగ్(61)ను.. మణిపూర్ సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. రాజధాని ఇంఫాల్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా బీరెన్ సింగ్‌కు ఓటు పడింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజ్జు చర్చలతో సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోసారి మణిపూర్ సీఎంగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. బీరెన్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. Heartiest congratulations Shri @NBirenSingh ji on getting elected as Chief Minister of Manipur once again. Under your able leadership, I am sure Manipur will continue on the path of accelerated growth & development. My best wishes for all your future endeavours. — Himanta Biswa Sarma (@himantabiswa) March 20, 2022 ఇక గడిచిన ఎన్నికల్లో ఎన్. బీరెన్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి పంగీజం శరత్చంద్ర సింగ్‌పై 18 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యేగా బీరెన్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జర్నలిస్ట్ కూడా.. బీరెన్ సింగ్ Nongthombam Biren Singh రాజకీయాల్లోకి రాక ముందు ఫుట్‌బాల్ క్రీడాకారుడుగా రాణించారు. కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆయా రంగాల్లో తనదైన గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2016 అక్టోబర్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌పై జరిగిన తిరుగుబాటులో సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత 17 అక్టోబర్ 2016న బీజేపీలో చేరారు. మరుసటి ఏడాదే రాష్ట్ర ఎన్నికల తర్వాత సీఎం అయ్యారు. కాగా 60 అసెంబ్లీ సీట్లు ఉన్న రెండు మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా.. బీజేపీ 32 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఈ విజయంలో బీరెన్ సింగ్ నాయకత్వమే ముఖ్యభూమిక పోషించింది. -
బడ్జెట్ సమావేశాలు.. 7 రోజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15వ తేదీ వరకు 7 రోజులు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందున మరో 6 రోజులు సమావేశాలు కొనసాగనున్నాయి. సభ్యులు కోరితే సమావేశాల పొడిగింపుపై 15న మరోమారు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి రోజూ కనీసం 12 గంటలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బీఏసీ నిర్ణయాలను ఈ నెల 9న బుధవారం శాసనసభకు సమర్పిస్తారు. శాఖల వారీ పద్దుపై 4 రోజులు చర్చ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మంగళవారం, ఈ నెల 13న ఆదివారం శాసనసభ సమావేశాలకు విరామం ఉంటుంది. 9న సభ సమావేశమయ్యాక బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాలు, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 10, 11, 12, 14 తేదీల్లో బడ్జెట్ పద్దులపై శాఖల వారీగా చర్చ జరుగుతుంది. 10న సంక్షేమ శాఖలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ జరగనుంది. 15న ద్రవ్య, వినిమయ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బీఎసీ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. బడ్జెట్‌పై మండలిలో 10న చర్చ ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలోనూ సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు చేశారు. 8, 9 తేదీల్లో శాసన మండలి సమావేశాలకు విరామం ప్రకటించడంతో పాటు ఈ నెల 10న తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. 10న మండలిలో బడ్జెట్‌పై చర్చ, అదే రోజు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. 11, 12 తేదీల్లో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశముంది. ఎన్నిక షెడ్యూల్ విడుదలపై 10న జరిగే మండలి సమావేశంలో స్పష్టత రానున్నది. 14న మండలి సమావేశాలకు విరామం ప్రకటించారు. 15న మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. -
అసెంబ్లీ సమావేశాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతాలాపన చేసి సమావేశాలను మొదలుపెట్టారు. సుమారు పావుగంట పాటు జరిగిన తొలిరోజు కార్యక్రమాల్లో.. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను సమర్పించారు. తర్వాత ఇటీవలికాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించారు. అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండు ఆర్డినెన్సులు.. తెలంగాణ హౌజింగ్ బోర్డు ఆర్డినెన్స్ (2021)ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ 2021ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి జగదీశ్‌రెడ్డి; టూరిజం అభివృద్ధి సంస్థ తొలి వార్షిక నివేదికను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్; తెలంగాణ సమగ్ర శిక్షణా కార్యక్రమం వార్షిక నివేదికను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు అందజేశారు. తొమ్మిది మందికి నివాళి ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పిస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్), కుంజా భిక్షం (బూర్గంపాడు), మేనేని సత్యనారాయణరావు (కరీంనగర్), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), బుగ్గారపు సీతారామయ్య (బూర్గంపాడు), చేకూరి కాశయ్య (కొత్తగూడెం/పాల్వంచ) మృతిపట్ల సంతాపం ప్రకటించింది. శాసనసభ్యులుగా వారి రాజకీయ ప్రస్థానం, సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నివాళి అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇద్దరు కొత్త సభ్యులతో మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. మండలి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నారదాసు లక్ష్మణరావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్ఏ రెహ్మాన్, ఆర్.ముత్యంరెడ్డిలకు నివాళిగా మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత రెండు ఆర్డినెన్సులు, పలు నివేదికలను మండలి ముందు ఉంచినట్టు చైర్మన్ ప్రకటించారు. సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు. -
నవశకానికి నాంది
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు సగర్వంగా తలెత్తుకున్నాయి.. సాధికారికత ఉట్టి పడుతుండగా మహిళలు ఆత్మగౌరవంతో తొణికిసలాడారు.. ఇక ఉపాధికి ఢోకా లేదంటూ యువతకు భవితపై భరోసా వచ్చింది.. ఇదంతా ఎన్నో ఏళ్ల కల.. ఎన్నాళ్లుగానో ఆరాటం.. అలుపెరగని పోరాటం.. వాటన్నింటినీ ఒక్కసారిగా నిజం చేసి చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ కలను ఒక్క రోజులో సాకారం చేసి అద్భుతాన్ని ఆవిష్కరించి మన కళ్లముందు నిలిపారు.. ఈ అద్భుత చారిత్రక ఘట్టానికి రాష్ట్ర శాసససభ వేదికగా నిలిచింది.. రాష్ట్రంలో కొత్త చరిత్రకు తెరలేచింది.. సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దాదాపు 60 శాతం పదవులు కేటాయించి దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నిజమైన రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించే బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఇక నుంచి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భర్తీ చేయబోయే అన్ని రకాల నామినేటెడ్ పదవుల్లో ఆ వర్గాలు కచ్చితంగా 50 శాతం పదవులు దక్కించుకుంటాయి. దీంతో అన్ని స్థాయిల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా ప్రబల శక్తిగా రూపాంతరం చెందడం ఖాయం. అదే విధంగా ఈ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం ఆ వర్గాలకే ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించడం ఆ వర్గాలకు తీపి కబురే. నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీసుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చేలా చట్టం రూపొందడం ఆ వర్గాల అభ్యున్నతికి మార్గం సుగమం చేసింది. నిజమైన మహిళా సాధికారికతకు శ్రీకారం మహిళల రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్య్రం దిశగా ముఖ్యమంత్రి వైఎస్జగన్ కీలక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో భర్తీ చేయనున్న అన్ని నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో సగం అంటే 50 శాతం మహిళలకేనని తేల్చి చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదించడం శుభపరిణామం. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లోనూ సగం మహిళలే దక్కించుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించే నామినేటెడ్ పదవులు, పనులలో 50 శాతంతో పాటు ఇతర జనరల్ విభాగంలోని నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం మహిళలకు కేటాయించడం కొత్త చరిత్రే. నిజమైన మహిళా సాధికారికత అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూడాల్సిందే. చట్టబద్ధంగా బీసీ హక్కుల పరిరక్షణ మరో సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మన రాష్ట్రాన్ని వేదికగా మార్చారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టడం శుభపరిణామం. ఇకపై ఎక్కడైనా సరే బీసీ హక్కులకు భంగం వాటిల్లితే బీసీ కమిషన్ బాధితులకు అండగా నిలుస్తుంది. మరోవైపు ఉపాధి కల్పన కల కాదని నిరూపిస్తూ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించడం ఉద్యోగాల విప్లవాన్ని సృష్టించనుంది. ఈ విధంగా కీలకమైన ఆరు బిల్లులను శాసనసభలో ఆమోదింపజేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. సాధికారత దిశగా.. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మహిళలకు సీఎం వైఎస్ జగన్ సర్కార్ అగ్రతాంబూలం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున మహిళలకే కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర జనాభాలో సగం మంది మహిళలే ఉన్నప్పటికీ విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సమాన అవకాశాలు వారికి దక్కడం లేదు. మహిళా సాధికారతను సాధించాలంటే జనాభాలో సగం ఉన్న అతివలను అందలం ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక న్యాయం చేకూర్చడంతోపాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బిల్లులను రూపొందించారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లును, అలాగే అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మరో బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులో ఆయా వర్గాల మహిళలకు కూడా 50 శాతం ఇవ్వడంతోపాటు మిగతా 50 శాతం నామినేడెట్ పదవులు, నామినేటేడ్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో జనాభాలో సగం ఉన్న మహిళలకు మొత్తం మీద 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లైంది. అతివలకు జై.. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, బోర్డులు, సొసైటీలు, కమిటీల పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే వీటి చైర్పర్సన్ పదవుల్లోనూ 50 శాతం మహిళలకే కేటాయిస్తారు. అదేవిధంగా డైరెక్టర్లు, సభ్యుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. దేవాదాయ చట్టం పరిధిలోని బోర్డులు, చారిటబుల్ ట్రస్టులు, వక్ఫ్ బోర్డు పరిధిలోని పదవులకు ఈ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేశారు. అన్ని నామినేటెడ్, కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ సర్వీసు పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.ఇంజనీరింగ్ విభాగాలు, పరిపాలన విభాగాల నామినేటెడ్ పనులన్నింటిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు అందలం బిల్లులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50% ఉద్దేశం మహిళా సాధికారతను సాధించడం, జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన అంశాలు అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, బోర్డులు, సొసైటీలు, కమిటీల పదవుల్లో 50 శాతం మహిళలకే, చైర్పర్సన్ పదవుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్. అదేవిధంగా జనరల్ మహిళల రిజర్వేషన్ ఇదే రీతిలో వర్తింపు మినహాయింపు దేవదాయ చట్టం పరిధిలోని బోర్డులు, చారిటబుల్ ట్రస్టులు, వక్ఫ్ బోర్డు పరిధిలోని పదవులకు రిజర్వేషన్లు వర్తించవు స్థానికులకే పట్టం బిల్లు పరిశ్రమలు, ఫ్యాకర్టీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఎవరికి ప్రయోజనం పరిశ్రమలు, ఫ్యాక్టరీల కోసం తమ భూములు ఇచ్చి జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నవారికి, స్థానిక యువతకు.. బిల్లులో ప్రధాన అంశాలు కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాకర్టీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. దీంతోపాటు ఇప్పటికే ఉన్నవి కూడా మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికులకు తగిన అర్హత లేకపోతే శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. బీసీలకు బాసట బిల్లులు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు,ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్ వర్తింపు లక్ష్యం వెనుకబడిన వర్గాలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం, వారి అభ్యున్నతికి, సాధికారతకు కృషి చేయడం బీసీ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారంటే చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి, సభ్యులుగా ఒక సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాల సమస్యలపై అవగాహన ఉన్న మరో ఇద్దరు నిపుణులు, సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ కార్యదర్శి. బీసీ కమిషన్ ప్రధాన విధులు బీసీల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన అన్ని అంశాలను చూస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పుల తదితర అంశాలపై పనిచేస్తుంది. బీసీలపై జరిగే వేధింపులు కూడా కమిషన్ పరిధిలోకే వస్తాయి. బీసీల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫారసులు చేయడం, విద్యా ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ పాటించకపోతే ప్రభుత్వం దృష్టికి తేవడం, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనాలు, ప్రజాభిప్రాయ సేకరణలు చేయడం, బీసీలకు అన్ని రంగాల్లో రక్షణ చర్యలు తీసుకోవడం, తదితర అంశాలు. -
ట్రంప్ కంచు కోటలో అనూహ్య పరిణామం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితుల్లో రచెల్ క్రూక్స్ ఒకరు. తనను ట్రంప్ బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. అలాంటి క్రూక్స్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ట్రంప్ కంచుకోట అయిన ఓహయో నుంచి స్టేట్ లెజిస్టేచర్ అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అమెరికన్లు కలత చెంది ఉన్నారు. ట్రంప్ పాలనలో వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వారి తరపున గొంతుకను వినిపించేందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా’’ అంటూ ఆమె ఓ ప్రకటన చేశారు. కాగా, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీపై 61 శాతం ఓట్లతో ఇక్కడ విజయం సాధించారు. అందుకే ఏరీ కోరి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రచెల్ పేరును ప్రతిపాదించింది. మరోవైపు 35 ఏళ్ల రచెల్ కు కూడా ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ప్రస్తుతం హైడెల్ బర్గ్ యూనివర్సిటీ ఐఎస్ఆర్ విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. విద్యా వ్యవస్థ కోసం ఆమె చేసిన సంస్కరణలు కూడా మంచి ఫలితానిచ్చాయి. అన్నింటికి మించి ట్రంప్ పై ఆమె చేసే విమర్శలు జనాల్లోకి బలంగా నాటుకుపోతున్నాయి. అందుకే క్రూక్స్ ను డెమొక్రాటిక్ పార్టీ బరిలో దించుతోంది. ఇక రెండు దఫాలు ఇక్కడి నుంచి ఎంపికైన బిల్ రైనెకెతో క్రూక్స్ ఢీ కొట్టబోతున్నారు. మే 8 తొలి దఫా ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు ప్రచారంలో ట్రంప్-హిల్లరీ పాల్గొంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రచెల్ ఆరోపణలు... 2005లో ట్రంప్ టవర్లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారు. ట్రంప్ తనంతట తాను పరిచయం చేసుకుని ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఆపై బలవంతంగా ఆమె బుగ్గల మీద, తర్వాత పెదాల మీద ముద్దుపెట్టుకున్నాడు. ‘అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది, కానీ, నేను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారు’’ అని క్రూక్స ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ట్రంప్ తన దగ్గరికి వచ్చి తన ఫోన్ నెంబరు అడిగారని.. ఉద్యోగ రీత్యా తాను ఇవ్వాల్సి వచ్చిందని... అయితే తర్వాత ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదని ఆమె పేర్కొన్నారు. ఆమెతోపాటు మరో 16 మంది ఒకే సమయంలో ట్రంప్ పై ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కథనాలను ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది ఖండించారు కూడా. -
సీఎం కిరణ్‌కు గవర్నర్ ఝలక్
నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి సూచించిన పేరును తిరస్కరించిన నరసింహన్ అధిష్టానం సూచించిన పేర్లను మాత్రమే ఖరారు చేసిన గవర్నర్ కంతేటి, నంది ఎల్లయ్య, రత్నాబాయిల పేర్లకు మాత్రమే ఆమోదం కిరణ్ సొంతంగా సూచించిన రఘురామిరెడ్డి పేరుకు తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటా స్థానానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించిన పేరును గవర్నర్ నరసింహన్ తిరస్కరించారు. మండలిలోని నాలుగు నామినేటెడ్ స్థానాలకు గాను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, మాజీ ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నాలుగో స్థానానికి మాజీ ప్రధాని పి.వి.నర్సింహరావు కుమార్తె వాణితో పాటు మరికొందరు పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే నాలుగో స్థానానికి అభ్యర్థి ఎంపికపై సీఎం కిరణ్ - కాంగ్రెస్ హైమాండ్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటంతో కొద్దిరోజులుగా పెండింగ్‌లో పడింది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానానికి సీఎం తనకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త రఘురామిరెడ్డి పేరును ప్రతిపాదించారు. దీనికి పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. ఇటీవల మాజీ ఎంపీ రత్నాబాయి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలసి ఎమ్మెల్సీ పదవి కోసం విన్నవించినప్పుడు ‘‘మీ ముగ్గురి పేర్లనూ ఖరారు చేసి పంపాం కదా? ఇంకా ఫైల్ గవర్నర్‌కు సమర్పించలేదా?’’ అని సోనియా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ మూడు పేర్లతో గవర్నర్‌కు ఫైల్‌ను పంపించాలని పార్టీ పెద్దలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. నాలుగో స్థానానికి పార్టీ అధిష్టానం ఎవరి పేరునూ ఖరారు చేయకున్నా సీఎం వారు సూచించిన మూడు పేర్లతో పాటు రఘురామిరెడ్డి పేరును కూడా చేరుస్తూ గవర్నర్‌కు ఫైల్ సమర్పించారు. సోమవారం సీఎం గవర్నర్‌ను కలసి ఈ జాబితా అందించారు. అయితే గవర్నర్ ఫైలులో సీఎం సూచించిన రఘురామిరెడ్డి పేరును తిరస్కరించారు. ముగ్గురి పేర్లకు ఆమోదం తెలియచేస్తూ మంగళవారం రాత్రే ఫైల్‌పై సంతకం కూడా చేశారు. ఈ ఫైల్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కార్యాలయానికి బుధవారం చేరింది. ఆమేరకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గతంలోనూ సీఎంకు చుక్కెదురు... సీఎం సూచించిన పేరును తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకునున్న చర్యతో కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య ఇటువంటి వివాదం ఇదే కొత్తది కాదు. ఇంతకుముందు సమాచార హక్కు కమిషనర్ల స్థానాలపైనా ఇదే తరహా వివాదం తలెత్తింది. ఆర్టీఐ కమిషనర్ స్థానాలకు సీఎం ఎనిమిది మంది పేర్లు సూచించగా గవర్నర్ అందులో నాలుగు పేర్లపై విముఖత చూపారు. ఆ ఫైలులోని నలుగురి పేర్లకు మాత్రమే ఆమోదం తెలిపి తక్కిన వాటిని తిరస్కరించారు. చట్టనిబంధనలకు భిన్నంగా ఎంపిక చేసినందున గవర్నర్ ఆ పేర్లను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ 4 పేర్లతో ఫైలును ప్రభుత్వానికి వెనక్కు పంపారు. మళ్లీ అదే ఫైలును సీఎం గవర్నర్‌కు పంపటంతో ఆయన ఆమోదించక తప్పలేదు. ఎట్టకేలకు మండలికి రాజు మండలి రాజుగా ముద్రపడ్డ కంతేటి సత్యనారాయణరాజు కల ఎట్టకేలకు ఫలించింది. ఎమ్మెల్సీ స్థానం కోసం కౌన్సిల్ పునరుద్ధరణ అయినప్పటినుంచీ సత్యనారాయణరాజు ప్రయత్నాలు కొనసాగిస్తున్నా ఆయన కోరిక ఇప్పటికి కానీ నెరవేరలేదు. ఇటీవల రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో పార్టీ నుంచి కె.వి.పి.రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బరామిరెడ్డిలకు మళ్లీ అవకాశం దక్కింది. వీరితోపాటు పదవీ విరమణ చేసిన నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు అవకాశమివ్వలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే ఎదురయ్యాయి. దీంతో నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు శాసనమండలిలో అవకాశం కల్పించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
ఎల్లుండి హస్తినకు బిల్లు చర్చల సారాంశం
సోమవారం ఉదయం విమానంలో తీసుకెళ్లనున్న ప్రత్యేకాధికారి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013కు సంబంధించి రాష్ట్ర శాసనమండలి, శాసనసభలో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి సోమవారం ఢిల్లీకి పంపించనున్నారు. ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, సారాంశం, చర్చల రికార్డు ప్రతులు, ప్రతిపాదిత సవరణలు, సూచనలను క్రోడీకరించి ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసే పని ముగింపు దశకు వచ్చింది. ఉభయ సభల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో క్రోడీకరించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారానే కేంద్ర హోం శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నివేదిక శుక్రవారం సాయంత్రమే సీఎస్ పి.కె.మహంతికి చేరింది. ఉభయసభల అభిప్రాయాలను సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో హస్తినకు పంపాలని ఆయన నిర్ణయించారు. చర్చల రికార్డులపై ఏం చేయాలనే అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రధానాంశాలపై సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా సారాంశాలను సాధారణ పరిపాలన శాఖ తయారు చేయనుంది. ప్రభుత్వ తీర్మానం ప్రతిని, సభ్యుల సవరణలను కూడా నివేదికకు జత చేయనున్నారు. మొత్తం కలిపి 400 నుంచి 500 పేజీల బండిల్ తయారవుతుందని సమాచారం. బిల్లును, సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సభలో చర్చ ముగిసిన మూడు రోజుల్లోగా పంపించాల్సిందిగా రాష్ట్రపతి పేర్కొనడం తెలిసిందే. మూడు రోజుల గడువు ఆదివారంతో ముగియనుంది. ఆ రోజు సెలవైనందున సోమవారం ఉదయమే పంపనున్నారు.