బడ్జెట్‌ సమావేశాలు.. 7 రోజులు  | Telangana Budget 2022: Budget Meetings Till March 15 | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ సమావేశాలు.. 7 రోజులు 

Published Tue, Mar 8 2022 2:52 AM | Last Updated on Tue, Mar 8 2022 9:27 AM

Telangana Budget 2022: Budget Meetings Till March 15 - Sakshi

బీఏసీ భేటీలో స్పీకర్‌ పోచారం, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, భట్టి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ 2022–23 బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 15వ తేదీ వరకు 7 రోజులు నిర్వహించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందున మరో 6 రోజులు సమావేశాలు కొనసాగనున్నాయి. సభ్యులు కోరితే సమావేశాల పొడిగింపుపై 15న మరోమారు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి రోజూ కనీసం 12 గంటలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బీఏసీ నిర్ణయాలను ఈ నెల 9న బుధవారం శాసనసభకు సమర్పిస్తారు.  

శాఖల వారీ పద్దుపై 4 రోజులు చర్చ 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మంగళవారం, ఈ నెల 13న ఆదివారం శాసనసభ సమావేశాలకు విరామం ఉంటుంది. 9న సభ సమావేశమయ్యాక బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాలు, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 10, 11, 12, 14 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై శాఖల వారీగా చర్చ జరుగుతుంది. 10న సంక్షేమ శాఖలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ జరగనుంది.

15న ద్రవ్య, వినిమయ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బీఎసీ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.  

బడ్జెట్‌పై మండలిలో 10న చర్చ 
ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలోనూ సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు చేశారు. 8, 9 తేదీల్లో శాసన మండలి సమావేశాలకు విరామం ప్రకటించడంతో పాటు ఈ నెల 10న తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. 10న మండలిలో బడ్జెట్‌పై చర్చ, అదే రోజు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. 11, 12 తేదీల్లో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశముంది. ఎన్నిక షెడ్యూల్‌ విడుదలపై 10న జరిగే మండలి సమావేశంలో స్పష్టత రానున్నది. 14న మండలి సమావేశాలకు విరామం ప్రకటించారు. 15న మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement