నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి సూచించిన పేరును తిరస్కరించిన నరసింహన్
అధిష్టానం సూచించిన పేర్లను మాత్రమే ఖరారు చేసిన గవర్నర్
కంతేటి, నంది ఎల్లయ్య, రత్నాబాయిల పేర్లకు మాత్రమే ఆమోదం
కిరణ్ సొంతంగా సూచించిన రఘురామిరెడ్డి పేరుకు తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటా స్థానానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించిన పేరును గవర్నర్ నరసింహన్ తిరస్కరించారు. మండలిలోని నాలుగు నామినేటెడ్ స్థానాలకు గాను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, మాజీ ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నాలుగో స్థానానికి మాజీ ప్రధాని పి.వి.నర్సింహరావు కుమార్తె వాణితో పాటు మరికొందరు పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే నాలుగో స్థానానికి అభ్యర్థి ఎంపికపై సీఎం కిరణ్ - కాంగ్రెస్ హైమాండ్‌ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటంతో కొద్దిరోజులుగా పెండింగ్‌లో పడింది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానానికి సీఎం తనకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త రఘురామిరెడ్డి పేరును ప్రతిపాదించారు. దీనికి పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది.
ఇటీవల మాజీ ఎంపీ రత్నాబాయి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలసి ఎమ్మెల్సీ పదవి కోసం విన్నవించినప్పుడు ‘‘మీ ముగ్గురి పేర్లనూ ఖరారు చేసి పంపాం కదా? ఇంకా ఫైల్ గవర్నర్‌కు సమర్పించలేదా?’’ అని సోనియా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ మూడు పేర్లతో గవర్నర్‌కు ఫైల్‌ను పంపించాలని పార్టీ పెద్దలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. నాలుగో స్థానానికి పార్టీ అధిష్టానం ఎవరి పేరునూ ఖరారు చేయకున్నా సీఎం వారు సూచించిన మూడు పేర్లతో పాటు రఘురామిరెడ్డి పేరును కూడా చేరుస్తూ గవర్నర్‌కు ఫైల్ సమర్పించారు. సోమవారం సీఎం గవర్నర్‌ను కలసి ఈ జాబితా అందించారు. అయితే గవర్నర్ ఫైలులో సీఎం సూచించిన రఘురామిరెడ్డి పేరును తిరస్కరించారు. ముగ్గురి పేర్లకు ఆమోదం తెలియచేస్తూ మంగళవారం రాత్రే ఫైల్‌పై సంతకం కూడా చేశారు. ఈ ఫైల్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కార్యాలయానికి బుధవారం చేరింది. ఆమేరకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.
గతంలోనూ సీఎంకు చుక్కెదురు...
సీఎం సూచించిన పేరును తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకునున్న చర్యతో కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య ఇటువంటి వివాదం ఇదే కొత్తది కాదు. ఇంతకుముందు సమాచార హక్కు కమిషనర్ల స్థానాలపైనా ఇదే తరహా వివాదం తలెత్తింది. ఆర్‌టీఐ కమిషనర్ స్థానాలకు సీఎం ఎనిమిది మంది పేర్లు సూచించగా గవర్నర్ అందులో నాలుగు పేర్లపై విముఖత చూపారు. ఆ ఫైలులోని నలుగురి పేర్లకు మాత్రమే ఆమోదం తెలిపి తక్కిన వాటిని తిరస్కరించారు. చట్టనిబంధనలకు భిన్నంగా ఎంపిక చేసినందున గవర్నర్ ఆ పేర్లను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ 4 పేర్లతో ఫైలును ప్రభుత్వానికి వెనక్కు పంపారు. మళ్లీ అదే ఫైలును సీఎం గవర్నర్‌కు పంపటంతో ఆయన ఆమోదించక తప్పలేదు.
ఎట్టకేలకు మండలికి రాజు
మండలి రాజుగా ముద్రపడ్డ కంతేటి సత్యనారాయణరాజు కల ఎట్టకేలకు ఫలించింది. ఎమ్మెల్సీ స్థానం కోసం కౌన్సిల్ పునరుద్ధరణ అయినప్పటినుంచీ సత్యనారాయణరాజు ప్రయత్నాలు కొనసాగిస్తున్నా ఆయన కోరిక ఇప్పటికి కానీ నెరవేరలేదు. ఇటీవల రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో పార్టీ నుంచి కె.వి.పి.రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బరామిరెడ్డిలకు మళ్లీ అవకాశం దక్కింది. వీరితోపాటు పదవీ విరమణ చేసిన నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు అవకాశమివ్వలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే ఎదురయ్యాయి. దీంతో నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు శాసనమండలిలో అవకాశం కల్పించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సీఎం కిరణ్‌కు గవర్నర్ ఝలక్
Published Thu, Feb 13 2014 1:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement