గవర్నర్ నరసింహన్ తో కిరణ్(ఫైల్)
* సీఎంగా కిరణ్ గత 2 నెలల్లో తీసుకున్న నిర్ణయాల సమీక్ష
* ముఖ్యమంత్రి పేషీ అధికారుల బదిలీల్లో మార్పులు
* నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారితో రాజీనామా చేరుుంచేందుకూ నిర్ణయం
* ఫైళ్లు సర్క్యులేట్ చేయూల్సిందిగా సీఎస్‌కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోట్
* అన్ని శాఖలకు మహంతి ప్రత్యేక నోట్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి గత రెండు నెలల్లో నిబంధనలకు విరుద్ధంగా విధాన, ఆర్థికపరమైన అంశాలపై తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఆయన సమీక్షించనున్నారు. రాజీనామాకు ముందురోజు కిరణ్ తన పేషీలోని అధికారులను కీలక శాఖలకు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు. జవహర్‌రెడ్డి, శ్రీధర్‌లను ఇతర శాఖలకు గవర్నర్ బదిలీ చేశారు. నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారి చేత రాజీనామా చేయించాలని కూడా నరసింహన్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.రమేశ్‌కుమార్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ప్రత్యేకంగా నోట్ పంపారు.
కిరణ్ నిర్ణయాలకు సంబంధించి ఏ తేదీ మొదలుకుని ఫైళ్లు పంపాలో తెలియజేయాల్సిందిగా సీఎస్ సోమవారం వివరణ కోరిన నేపథ్యంలో.. గత రెండు నెలల ఫైళ్లను గవర్నర్‌కు సర్క్యులేట్ చేయాల్సిందిగా రమేశ్‌కుమార్ ఆ నోట్‌లో స్పష్టం చేశారు. తొలుత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను మరోసారి సమీక్షించాల్సిందిగా అధికారులు ముఖ్యమంత్రికి పంపినా పట్టించుకోకుండా తొలుత తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయాలని సీఎం పేర్కొన్న ఫైళ్లను కూడా సర్క్యులేట్ చేయాలని కోరారు.
అధికారులకు ఇష్టం లేకున్నా బలవంతంగా సంతకాలు చేసినట్లైతే అలాంటి ఫైళ్లను కూడా పంపాలని గవర్నర్ కార్యాలయం సూచించింది. దీంతో సీఎస్ ఈ మేరకు ఫైళ్లు గవర్నర్‌కు పంపాల్సిందిగా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రత్యేక నోట్‌ను జారీ చేశారు. మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వివిధ శాఖలు, సంస్థల్లో భర్తీ చేసిన నామినేటెట్ పదవుల్లో కొనసాగుతున్న వారితో గవర్నర్ రాజీనామా చేయించనున్నారు. సలహాదారులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఎవరెవరు కొనసాగుతున్నారో జాబితాలు పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం కోరిన విషయం ‘సాక్షి’ పాఠకులకు ముందే వెల్లడించింది.
కాగా ఈ వివరాలు కూడా గవర్నర్‌కు పంపాలని సీఎస్ మంగళవారం పలు శాఖలకు ప్రత్యేక నోట్ జారీ చేశారు. సీఎంగా రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు కిరణ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సత్యారావును నియమించిన విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని సంస్థలకు చెందిన నామినేటెడ్ పోస్టులనూ ఆయన భర్తీ చేశారు. ఇలాంటి వారందరితో రాజీనామా చేయించాలని గవర్నర్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఇలావుండగా అధికార భాషా సంఘం చైర్మన్‌గా ఉన్న మండలి బుద్ధప్రసాద్ మంగళవారం సీఎస్‌ను కలిశారు. తాను గతంలోనే రాజీనామాను ముఖ్యమంత్రికి సమర్పించానని, దాన్ని ఆమోదించాలని కోరారు.
ప్రాజెక్టులకు అదనపు చెల్లింపుల ఫైళ్ల సమీక్ష
పలు సాగునీటి ప్రాజెక్టుల పనులకు అదనపు చెల్లింపులు చేసేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే జీవో కూడా జారీ చేశారు. ఈ ఫైలు ప్రస్తుతం సీఎస్ మహంతి వద్ద ఉంది. ఇప్పుడు ఈ ఫైలు గవర్నర్ సమీక్షకు వెళ్లనుంది. పులిచింతల ప్రాజెక్టు పనులకు అదనంగా చెల్లింపులు చేయూలని ప్రభుత్వం భావించింది. ఎంత చెల్లించాలనే విషయమై ఏర్పాటైన నిపుణుల కమిటీ రూ.70 కోట్లు మాత్రమే చెల్లించాలని సిఫారసు చేసింది. కానీ సీఎంగా చివరిరోజుల్లో రూ.115 కోట్లు ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ కిరణ్ హడావుడిగా ఫైలుపై సంతకం చేశారు. ఆ మరుసటి రోజే మెమో కూడా జారీ అయింది. ఈ ఫైలు కూడా గవర్నర్‌కు సర్క్యులేట్ కానుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.208 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించడానికి చివరిరోజుల్లో సీఎం ఆమోదం తెలిపారు. అయితే దీనిపై న్యాయశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుత సర్క్యులేషన్‌లో ఉన్న ఈ ఫైలును సైతం గవర్నర్ పరిశీలనకు పంపనున్నారు.
భూముల కేటాయింపు ఫైళ్లు కూడా...
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా చివరిరోజుల్లో ప్రజాపాలన వదిలేసి భూముల పందేరం చేయడంపై సాక్షి కథనం ప్రచురించింది. ఈ కేటాయింపులను అధికారులు తిరస్కరించినా సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ ఫైళ్లను కూడా గవర్నర్ సమీక్షించనున్నారు. విశాఖ జిల్లాలో చినగదిలి మండలం కూర్మన్నపాలెం గ్రామంలో 20 ఎకరాల అత్యంత విలువైన జాగీర్‌దార్ భూమిని ముగ్గురు వ్యక్తులకు కట్టపెట్టే ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఎస్‌ఎఫ్‌ఆర్ రిసార్ట్స్ సంస్థకు 431 ఎకరాలను కట్టపెడుతూ వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ జీవోను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కోరినా ముఖ్యమంత్రి తిరస్కరించారు.
కిరణ్‌కు రెండోసారీ చుక్కెదురు!
తన స్నేహితుడైన రఘురామిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకోవాలని కిరణ్ సీఎంగా రెండోసారి చేసిన ప్రయత్నానికీ నరసింహన్ గండికొట్టారు. కె.సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నబాయి, రఘురామిరెడ్డిల పేర్లను కిరణ్ సిఫారసు చేశారు. అరుుతే గవర్నర్ తొలి మూడు పేర్లను మాత్రమే ఆమోదిస్తూ రఘురామిరెడ్డి పేరు తిరస్కరిస్తూ ఫైలు పంపారు.
దీంతో కిరణ్ రెండోసారి ప్రభుత్వం సిఫారసు చేసిన నాలుగు పేర్లను ఆమోదించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశారు. సంబంధిత ఫైలును మరోసారి నరసింహన్‌కు పంపారు. అయితే గవర్నర్ రెండోసారి కూడా తొలి మూడు పేర్లకే ఆమోదం తెలుపుతూ ఫైలును వెనక్కు పంపారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ ఆ ముగ్గురినీ గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.