కిరణ్ రాజీనామా ఆమోదం
-
19వ తేదీ నుంచి అమల్లోకి: గవర్నర్
-
ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని విజ్ఞప్తి
-
మంత్రులు కూడా కొనసాగాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం ఆమోదించారు. రాజీనామా ఫిబ్రవరి 19 నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. ఆ వెంటనే రాజీనామా ఆమోదంపై గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేదాకా ఆపద్ధర్మ సీఎం గా కొనసాగాలని, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా పదవుల్లో కొనసాగాలని గవర్నర్ కోరారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మర్నాడు 19వ తేదీన కిరణ్ రాజీనామా చేయడం, గవర్నర్‌కు లేఖ సమర్పించడం తెలిసిందే. దానిపై రెండు రోజులుగా ఏ నిర్ణయం తీసుకోని గవర్నర్, రాజీనామాను ఆమోదించారు. కిరణ్, సహచర మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేదాకా పదవుల్లో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, తాను ఆపద్ధర్మ సీఎంగా కూడా కొనసాగలేనని రాజీనామా లేఖ సమర్పణ సందర్భంగానే గవర్నర్‌కు స్పష్టం చేయడం తెలిసిందే. తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందే ప్రయత్నాల్లో తలమునకలై ఈ రెండు రోజులూ రాజీనామా అంశాన్ని కేంద్రం పట్టించుకోలేదు. కిరణ్ రాజీనామా అనంతర పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నివేదిక కూడా అందించారు. రాష్ట్రపతి పాలనకు ఆయన సిఫార్సు చేసినట్టు సమాచారం. దానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకునేదాకా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక గానీ పరిస్థితి ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని వివరించాయి.
రెండో రోజూ ఇంటికే పరిమితం
రాజీనామా చేసిన తర్వాత రెండో రోజైన శుక్రవారం కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. రెండో రోజు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ కిరణ్‌ను కలుసుకోవడానికి రాలేదు. చిత్తూరుకు చెందిన కొందరు రెండవ స్థాయి కాంగ్రెస్ నేతలు మాత్రం నలుగురు ఆయన్ను కలిశారు. వారితో గంటపాటు మాట్లాడి నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం డీజీపీ ప్రసాద్‌రావు పావుగంట పాటు కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడేందుకు డీజీపీ నిరాకరించడంతో వారి చర్చల సారాంశం తెలియరాలేదు. కిరణ్ రోజంతా టీవీ చూస్తూ ఢిల్లీ పరిణామాలను గమనించారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. అలాగే జిల్లాల వారీగా నేతలకు ఫోన్లు చేస్తూ విభజన అనంతర పరిస్థితులను అంచనా వేశారని సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందా? లేదా? అనే అంశాలను వారి నుంచి కిర ణ్ ఆరా తీశారని తెలుస్తోంది.