సీఎస్‌కు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల చర్చలు
ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరిన మహంతి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సమ్మె విరమించలేమని తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ సమ్మె విరమించబోమని సమ్మెలో ఉన్న ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి తేల్చిచెప్పాయి. ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్‌టీసీ ఈయూ సమైక్యాంధ్ర పోరాట సమితి చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్ దామోదరరావు, ఎన్‌ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రసాద్, రమణారెడ్డి, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, నాయకులు మురళీమోహన్, కృష్ణయ్య తదితరులు మంగళవారం సీఎస్‌తో చర్చలకు హాజరయ్యారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తిరుమల, విజయవాడల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయని, ఆర్‌టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రజా రవాణా స్తంభించిందని చెప్పిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సమ్మెలో ఉన్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించలేమని ఉద్యోగులు తేల్చిచెప్పారు. విభజన జరిగితే ఉద్యోగులకు కలిగే ఇబ్బందులు, నష్టాల గురించి సీఎస్ అడిగినప్పుడు.. ‘ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో శాఖల వారీగా సమస్యలను వివరించాం. మంత్రుల సూచన మేరకు సమస్యలు, ఇబ్బందులపై ఉద్యోగులు సంబంధిత శాఖలకు నివేదికలూ ఇచ్చారు. ఆ సమావేశంలో మీరు (సీఎస్) కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమస్యల గురించి అడగడం బాధ కలిగించింది’ అని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వివరించి ఆయన వద్ద సమావేశం ఏర్పాటు చేయిస్తానని సీఎస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యమం మరింత ఉధృతం
ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా సమ్మె వల్ల ఇబ్బంది పడుతున్నారని, అయితే ఈ ఇబ్బందుల కంటే విభజన వల్ల వచ్చే సమస్యలు తీవ్రమైనవని సీఎస్‌కు చెప్పామని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. విభజన జరగదని రాజకీయంగా స్పష్టమైన హామీ వస్తే సమ్మె విరమణకు సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన సీఎస్‌తో భేటీ అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకులాల సిబ్బంది సమ్మె విరమించి వెంటనే వస్తే సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తామని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మెసేజ్‌లు పంపటాన్ని అశోక్‌బాబు తప్పుబట్టారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఫిర్యాదు చేశామని, అందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఢిల్లీ వదిలి ప్రజల్లోకి రండి...
అంతకుముందు ఏపీఎన్‌జీవో కార్యాలయంలో అశోక్‌బాబు మాట్లాడుతూ.. తమ పదవులకు రాజీనామా సమర్పించి స్పీకర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఎంపీలు, వారి రాజీనామాల్లో చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీని వదిలి ప్రజా ఉద్యమంలోకి రావాలని సూచించారు. రాజీనామాలు చేశామని చెప్తూ.. ప్రభుత్వ క్వార్టర్లు, విమాన టికెట్లు తదితర అధికారిక సదుపాయాలను వినియోగించుకోవడం ఎంతమాత్రం నైతికత అనిపించుకోదన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా.. రాజీనామా చేయని ఎంపీల ఇళ్ల వద్ద ధర్నాలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
పదవులకు రాజీనామాలు చేసి, ఇంకా ఢిల్లీలోనే ఉన్న ఎంపీలకు మినహాయింపేమీ లేదని స్పష్టంచేశారు. ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, నైతికంగా పదవులను త్యజించిన నేతలు ఢిల్లీని వదిలి పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవడమనేది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం కనుక.. ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే యూపీఏ ప్రభుత్వం తలొగ్గక తప్పదన్నారు. రాజీనామా చేయని ఎంపీల ఇళ్ల వద్ద ఆందోళన ఉధృతం చేయడం ద్వారా వారిపై మరింత ఒత్తిడి పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఈ నెల 3న (గురువారం) సమావేశమై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సమ్మె కొనసాగింపుపై చర్చిస్తామన్నారు.
స్పష్టమైన హామీ ఇస్తే విరమిస్తాం: మురళీకృష్ణ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం లేదా రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పాటై 13 సంవత్సరాలు పూర్తయినా, ఉద్యోగుల సర్వీస్ సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మన రాష్ట్ర పరిస్థితి గతంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాల కంటే భిన్నమైనదని, క్లిష్టమైందని.. విభజన వల్ల పలు సమస్యలు వస్తాయని చెప్పారు. విభజన జరిగినా ఉద్యోగులకు సమస్యలేమీ ఉండవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు.
అవసరమైతే సీఎం కూడా చర్చలు జరుపుతారు: ఆనం
ఉద్యోగులు సమ్మె విరమించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చర్చలు జరుపుతారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో సీఎంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర కమిటీ హైదరాబాద్ రావాలని, ఇక్కడి నుంచి ఉద్యోగులు ఢిల్లీకి రాలేరని సోనియాగాంధీకి, దిగ్విజయ్‌సింగ్‌కు సీఎం చెప్పారని, త్వరలోనే కమిటీ ఇక్కడికి వచ్చే అవకాశముందని మంత్రి వివరించారు. సీఎం వైఖరి అధిష్టానాన్ని ధిక్కరించేలా ఒక అభిప్రాయం ఉందన్న ప్రశ్నకు ఆనం బదులిస్తూ.. చూసే వ్యక్తి చూపును బట్టి అభిప్రాయం ఉంటుందని, ఆరోపణ చేయాలనుకున్న వారికి అలాగే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందన్న జగన్ వ్యాఖ్యలపై మీరేమంటారని ప్రశ్నించగా.. ‘‘విభజనకు అనుకూలమని జగన్ తన తండ్రి సమాధి వద్ద ప్రమాణం చేశారు. చంద్రబాబు తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లని చెప్పారు. చివరకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కానీ రాజకీయ స్వార్థంతో నాలుగు సీట్లు సంపాదించుకోవాలన్న ఆశతో కొందరు నిర్ణయాలు మార్చుకున్నారు’’ అని ఆరోపించారు.