బస్సు దుర్ఘటనపై సీఐడీ దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద 45 మందిని బలిగొన్న ఘోర దుర్ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బస్సు ప్రమాదానికి కారణాలు, బాధ్యులను గుర్తించడంతోపాటు బస్సు యజమాన్యం నిబంధనలను అతిక్రమించిన తీరుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. బస్సు దుర్ఘటనపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ పి.కె.మహంతి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, డీజీపీ ప్రసాదరావు, ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్, రవాణా శాఖ కమిషనర్ అనంతరాము, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదం తీరు, ప్రాథమికంగా నిర్ధారించిన కారణాలను సీఎం అధికారులనడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. గతేడాది షిర్డీకి వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయి 32 మంది మృతి చెందిన ఘటనలో, తాజా దుర్ఘటనలో ఉన్నవి వోల్వో బస్సులే కావటంతో.. కారణాలను పూర్తిగా తెలుసుకోవాల్సి ఉన్నం దున సీఐడీ విచారణ అవసరమన్నారు.
ఈ మేరకు సీఐడీ విచారణకు ఆదేశించి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసు చేసేందుకు మరో అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో ఐఏఎస్ అధికారులతో పాటు ఆటోమొబైల్, ఇంధనశాఖ ఇంజనీర్లకు చోటు కల్పించాలన్నారు. బుధవారం నాటి దుర్ఘటనలో.. నిమిషాల వ్యవధిలోనే వోల్వో బస్సు బుగ్గిగా మారటం, ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా తలుపులు తెరుచుకోకపోవటం, అత్యవసర ద్వారాలను వారు ఉపయోగించుకోలేకపోవటం.. తదితర ప్రశ్నలకు జవాబులు దొరకాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. డీఎన్‌ఏ పరీక్షలను త్వరగా పూర్తిచేసి, వారం రోజుల్లో మృతదేహాలను బంధువులకు అందజేయాలని సీఎం ఆదేశించారు.