- ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లకు కనెక్టివిటీ కావాలి
- మరో 859 బస్‌షెల్టర్లు అవసరం
- సీటీఎస్ నివేదికపై ఆర్టీసీ సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: మహానగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా అభివృద్ధి కోసం లీ అసోసియేట్స్ సమర్పించిన సమగ్ర రవాణా అధ్యయన (సీటీఎస్) నివేదికపై ఆర్టీసీ పలు సూచనలు చేసింది. బుధవారం సీటీఎస్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్‌రావు, ఈడీ కోటేశ్వర్‌రావు, రవాణా కమిషనర్ జి.అనంతరాము తదితరులు పాల్గొన్నారు.
ఇందులో ఆర్టీసీ నివేదికపై చర్చ జరిగింది. తక్షణ అవసరాలతో పాటు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న 66 మెట్రో రైల్వేస్టేషన్లతో పాటు, ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లకు సిటీ బస్సును అనుసంధానం చేయాలని ఆర్టీసీ నివేదిక పేర్కొంది.
అలాగే 2041 నాటికి దశలవారీగా జరుగనున్న ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి అనుగుణంగా అన్ని రేడియల్ రోడ్లపై బస్‌బేలు, బస్‌స్టేషన్లు, ప్రయాణికుల వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ప్రతి రోజు 35 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న అతి పెద్ద ప్రజా రవాణా సంస్థయిన ఆర్టీసీని బలోపేతం చేసేందుకు, భవిష్యత్తు విస్తరకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అవేమిటంటే...
నగరంలోని 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 15కు మాత్రమే సిటీ బస్సులు వెళ్లేందుకు రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. మరో 11 స్టేషన్‌లకు కూడా తక్షణమే కనెక్టివిటీ కల్పించాలి.
అందుబాటులోకి రానున్న 66 మెట్రో రైలు స్టేషన్లను కూడా సిటీ బస్సులతో అనుసంధానించాలి. అక్కడ బస్‌బేలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి.
గ్రేటర్ పరిధిలో మరో 753 బస్‌షెల్టర్లు (ప్రస్తుతం ఉన్నవి 946) ఏర్పాటు చేయాలి. హెచ్‌ఎండిఏ పరిధిలో 41 బస్‌షెల్టర్లున్నాయి. మరో 106 తక్షణమే నిర్మించాలి. మరో 50 బస్‌బేలు ఏర్పాటు చేయాలి.
సికింద్రాబాద్, ఎల్‌బీనగర్, మెహదీపట్నం, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలతో పాటు, రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 20 భారీ జంక్షన్ల వద్ద ట్రాన్సిట్ బస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
2041 నాటికి దశలవారీగా అందుబాటులోకి రానున్న 33 రేడియల్ రోడ్లపై ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 200 బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి.
ప్రస్తుతం 3800 బస్సులతో ఆర్టీసీ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తోంది. మహానగర విస్తరణకు అనుగుణంగా 2021 నాటికి 7000, 2041 నాటికి 12000 బస్సులు పెరిగే అవకాశం ఉంది. వీటికి హెచ్‌ఎంఎ పరిధిలో 30 బస్‌డిపోలు అవసరం. వాటి కోసం తగిన విధంగా స్థలాల కేటాయింపు, రోడ్డు సదుపాయం అవసరం.