![నవ దంపతులకు త్రుటిలో తప్పిన ప్రమాదం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51400873290_625x300.jpg.webp?itok=20svh7aN)
నవ దంపతులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
- బైకును ఢీకొన్న బస్సు
- రెండు బస్సుల మధ్య నలిగిన బైకు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : బస్సు ప్రమాదం నుంచి నవదంపతులు త్రుటిలో తప్పించుకుని బయటపడ్డారు. సీతంపేట కూడలిలో జరిగిన ప్రమాదం, సంఘటనా స్థలంలో ఉన్న వారందరినీ గగుర్పాటుకు గురిచేసింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గంట్యాడకు చెందిన శ్రీనివాస్ చెల్లెలికి రెండు రోజుల క్రితం వివాహం జరిగింది.
శుక్రవారం ఉదయం శ్రీనివాస్ అతని తల్లి ఒక బైకుపై, చెల్లి, బావ మరొక బైకుపైనా షాపింగ్ కోసం జగదాంబ జంక్షన్‌కు బయలుదేరారు. సీతంపేట కూడలికి వచ్చే సరికి ముందున వెళ్తున్న ఏపీ 31 జెడ్ 0139 సిటీ బస్సు జంక్షన్‌లో ఆపాడు. ఆగిన బస్సును తప్పించి వెళ్లబోతున్న తరుణంలో వెనుక నుంచి వస్తున్న ఏపీ 11జెడ్ 6268 మెట్రో బస్సు బైకును ఢీకొట్టింది.
దీంతో రెండు బస్సుల మధ్య బైకు నలిగిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి నలుగురూ సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.