జాస్తి రాముడు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జాస్తి వెంకట రాముడు నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్‌సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది.