Jasti Venkata Ramudu
-
ఇజ్రాయెల్‌నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది
టెల్-అవీవ్ పర్యటన వివరాలు వెల్లడించిన డీజీపీ జేవీ రాముడు సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అనువైన, అవసరమైన, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని డీజీపీ జాస్తి వెంకటరాముడు చెప్పారు. అక్కడి టెల్-అవీవ్‌లో గత వారం జరిగిన అంతర్గత భద్రతపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 ప్రజాస్వామ్య దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. భారత్ తరఫున దక్షిణాది నుంచి డీజీపీ హోదాలో తనతోపాటు ఉత్తరాది నుంచి అదనపు డీజీ, ఐజీ, డీఐజీలు ముగ్గురు వచ్చారనిచెప్పారు. పోర్చుగల్, సైప్రస్, లాస్ ఏంజెల్స్, చికాగో పోలీసు చీఫ్‌లు, ఇంగ్లండ్ పోలీసు అధికారులు వక్తలుగా ప్రసంగించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ఇజ్రాయిల్‌ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సిందేనన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పటిష్టమైన కమ్యూనికేషన్స్ ఏర్పాటు, టెక్నాలజీ వినియోగం, ఆయుధాల సమీకరణ, వాడుతున్న ప్రొటెక్టివ్ గేర్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి ఏపీ సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. -
సబ్ డివిజన్‌గా తుళ్లూరు స్టేషన్
రాజధాని నేపథ్యంలో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిగా మారుతున్న తుళ్లూరులో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు అవసరాలపై రాష్ట్ర పోలీసు విభాగం దృష్టి పెట్టింది. తుళ్లూరు పోలీసుస్టేషన్‌ను సబ్-డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇతర అవసరాలకు సంబంధించి పూర్తి ప్రతిపాదనలు పంపాల్సిందిగా గుంటూరు జోన్ ఐజీ పీవీ సునీల్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయం ఆదేశించింది. గుంటూరు గ్రామీణ జిల్లాలోకి వచ్చే తుళ్లూరు పోలీసుస్టేషన్ ప్రస్తుతం అమరావతి సర్కిల్లో ఉంది. అమరావతితో పాటు సత్తెనపల్లి, అర్బన్, రూరల్, పిడుగురాళ్ల అర్బన్, రూరల్ సర్కిళ్లు సత్తెనపల్లి సబ్-డివిజన్లో ఉన్నాయి. పోలీసుస్టేషన్ స్థాయిలో ఉన్న తుళ్లూరుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ హోదాలో ఇన్చార్జ్గా సబ్-ఇన్స్పెక్టర్ (ఎసై్స) స్థాయి అధికారి ఉంటారు. కొత్త రాజధాని ఏర్పాట్ల నేపథ్యంలో ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి మొదలు అనేక మంది ప్రముఖుల తాకిడి ఉంటుంది. దీనికోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరోపక్క కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలను ఆకర్షించాలంటే అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ఆ ప్రాంతంలో జరుగుతున్న భారీ ఆర్థిక లావాదేవీలు నేరగాళ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం తక్షణ అవసరంగా తుళ్లూరును సబ్-డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసి డీఎస్పీని నియమించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న సత్తెనపల్లి సబ్-డివిజన్‌ను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. దీని పరిధిలో ఉన్న సర్కిళ్లు, పోలీసుస్టేషన్లను తుళ్లూరులో కలపాలని యోచిస్తున్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఎసై్సకి బదులు ఇన్స్పెక్టర్ను నియమించే ఆలోచన ఉన్నతాధికారులకు ఉంది. ఏపీ పోలీసుకు కొత్త డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్న 2012 బ్యాచ్‌కు చెందిన 34 మంది డీఎస్పీలను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి కేటాయించారు. వీరు మంగళవారం డీజీపీ జాస్తి వెంకట రాముడుకు రిపోర్ట్ చేశారు. ఈ అధికారులకు నిబంధనలకు అనుగుణంగా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తులు చేస్తోంది. -
ఏపీలో 29 మంది డీఎస్పీల బదిలీ
12 మంది అధికారులకు పోస్టింగ్ ఇవ్వని వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జాస్తి వెంకట రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు సహా వివిధ కారణాల నేపథ్యంలో వీరిలో 12 మందికి పోస్టింగ్ ఇవ్వని డీజీపీ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిలో కొందరు స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. -
'సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే స్పందిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు వచ్చే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలని అప్పుడే ఇరు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయని అంతకుముందు అభిప్రాయపడ్డారు. -
జాస్తి రాముడు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జాస్తి వెంకట రాముడు నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. -
కిరణ్ ఇచ్చిన పోస్టింగులన్నీ రద్దు
* ఐఏఎస్‌ల బదిలీలపై గవర్నర్ నరసింహన్ మార్కు సాక్షి, హైదరాబాద్: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఒకటీ రెండు రోజుల ముందు తన పేషీలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఇచ్చిన కీలక పోస్టింగులను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రద్దు చేశారు. అజయ్ కల్లాం మినహా జవహర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్, శంషీర్‌సింగ్ రావత్, సురేందర్‌ల బదిలీలను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన పోస్టింగ్‌లను ఒకటి తరువాత ఒకటి రద్దు చేస్తూ కొత్త పోస్టింగ్‌లు ఇస్తున్నారు. జెన్కో మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ అయిన శంషీర్‌సింగ్ రావత్ ఆ పోస్టులో చేరకముందే.. ఆయన్ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా మంగళవారం బదిలీ చేశారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద కార్యదర్శిగా పనిచేసి, చివరలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమితులైన జవహర్‌రెడ్డిపై కూడా బదిలీ వే టు వేశారు. ఆయన్ను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. అక్కడ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వి.నాగిరెడ్డిని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. నీటిపారుదల శాఖలో చేరి కొద్ది రోజులైనా కాకముందే జవహర్‌రెడ్డిపై బదిలీ వేటు గమనార్హం. సాగునీటి శాఖ నుంచి బదిలీ అయిన ఆదిత్యనాథ్ దాస్‌ను తిరిగి అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కిరణ్ వెళ్తూ వెళ్తూ తన వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఎన్.శ్రీధర్‌ను ఏపీ బ్రూవరీస్, డిస్టిలరీస్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించగా.. ఇప్పుడు ఆయన్ను ప్రాధాన్యం లేని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన సురేందర్‌ను కిరణ్ చివరిరోజున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. అయితే అక్కడున్న ఎండీ సుధాకర్ క్యాట్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విదితమే. దీనితో సురేందర్‌ను ఏపీఐఐసీకి బదిలీ చేశారు. గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా బసంత్‌కుమార్... గవర్నర్ నరసింహన్ తన వద్ద గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి, తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లిన బసంత్‌కుమార్‌ను మళ్లీ రాజ్‌భవన్‌కు రప్పించుకున్నారు. బసంత్‌కుమార్‌ను గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీగా ఉన్న రాహుల్ బొజ్జాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ సీహెచ్ శ్రీధర్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా హౌసింగ్‌బోర్డు ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన భారతి హోళికేరి పోస్టింగ్‌ను రద్దు చేసి, ఆమెను ప్రస్తుతం ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా కొనసాగాలని పేర్కొంటూ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగులు... ఈ మధ్యనే ఐఏఎస్‌లుగా ఎంపికైన ఆరుగురు అధికారులకు ప్రభుత్వం శిక్షణ నిమిత్తం వివిధ జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా నియమించింది. డాక్టర్ ఎన్.సత్యనారాయణ (నల్లగొండ), డాక్టర్ సి.శ్రీధర్ (కృష్ణా), ఎ.మహ్మద్ ఇంతియాజ్ (నెల్లూరు), పి.కోటేశ్వరరావు (రంగారెడ్డి), ఎస్.అరవింద్‌సింగ్ (వరంగల్), ఎం.ప్రశాంతి (హైదరాబాద్) ఆరు నెలల పాటు శిక్షణ పొందుతారు. గవర్నర్ వద్దకు ‘ప్రాసిక్యూషన్ ఫైళ్లు’! రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన.. తన మార్క్ చూపిస్తున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. తొలి ఝలక్‌గా మాజీ సీఎం చివరి సంతకాలపై నజర్.. ఈ పరిణామాలను బేరీజు వేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కోర్టు మెట్లు ఎక్కించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాసిక్యూషన్ అనుమతుల ఫైళ్ల అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంగళవారం గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఖాన్.. ప్రాసిక్యూషన్ అనుమతి అంశాన్నీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ లేఖపై రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన వచ్చి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు లభిస్తాయని ఏసీబీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆక్టోపస్ పగ్గాలు జేవీ రాముడికి... ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డెరైక్టర్ జనరల్ తేజ్‌దీప్ మీనన్‌ను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా, ఆక్టోపస్ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఎస్పీఎఫ్ డీజీగా బదిలీ చేసింది. ఆక్టోపస్ బాధ్యతలను రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జాస్తి వెంకటరాముడుకు అప్పగించింది. కాగా ఇంటెలిజెన్స్ ఎస్పీ రవికృష్ణను ఏపీఎస్పీ నాల్గో బెటాలియన్ (మన్ననూర్, వరంగల్) కమాండెంట్‌గా బదిలీ చేసింది.