కిరణ్ ఇచ్చిన పోస్టింగులన్నీ రద్దు | ESL NarasimhanCancel Kiran Kumar Last-Minute Postings | Sakshi
Sakshi News home page

కిరణ్ ఇచ్చిన పోస్టింగులన్నీ రద్దు

Published Wed, Mar 5 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

కిరణ్ ఇచ్చిన పోస్టింగులన్నీ రద్దు

కిరణ్ ఇచ్చిన పోస్టింగులన్నీ రద్దు

* ఐఏఎస్‌ల బదిలీలపై గవర్నర్ నరసింహన్ మార్కు
 
సాక్షి, హైదరాబాద్: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఒకటీ రెండు రోజుల ముందు తన పేషీలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఇచ్చిన కీలక పోస్టింగులను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రద్దు చేశారు. అజయ్ కల్లాం మినహా జవహర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్, శంషీర్‌సింగ్ రావత్, సురేందర్‌ల బదిలీలను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన పోస్టింగ్‌లను ఒకటి తరువాత ఒకటి రద్దు చేస్తూ కొత్త పోస్టింగ్‌లు ఇస్తున్నారు.

జెన్‌కో మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ అయిన శంషీర్‌సింగ్ రావత్ ఆ పోస్టులో చేరకముందే.. ఆయన్ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా మంగళవారం బదిలీ చేశారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద కార్యదర్శిగా పనిచేసి, చివరలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమితులైన జవహర్‌రెడ్డిపై కూడా బదిలీ వే టు వేశారు. ఆయన్ను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. అక్కడ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వి.నాగిరెడ్డిని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. నీటిపారుదల శాఖలో చేరి కొద్ది రోజులైనా కాకముందే జవహర్‌రెడ్డిపై బదిలీ వేటు గమనార్హం.

సాగునీటి శాఖ నుంచి బదిలీ అయిన ఆదిత్యనాథ్ దాస్‌ను తిరిగి అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కిరణ్ వెళ్తూ వెళ్తూ తన వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఎన్.శ్రీధర్‌ను ఏపీ బ్రూవరీస్, డిస్టిలరీస్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించగా.. ఇప్పుడు ఆయన్ను ప్రాధాన్యం లేని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన సురేందర్‌ను కిరణ్ చివరిరోజున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. అయితే అక్కడున్న ఎండీ సుధాకర్ క్యాట్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విదితమే. దీనితో సురేందర్‌ను ఏపీఐఐసీకి బదిలీ చేశారు.

గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా బసంత్‌కుమార్...
గవర్నర్ నరసింహన్ తన వద్ద గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి, తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లిన బసంత్‌కుమార్‌ను మళ్లీ రాజ్‌భవన్‌కు రప్పించుకున్నారు. బసంత్‌కుమార్‌ను గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీగా ఉన్న రాహుల్ బొజ్జాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ సీహెచ్ శ్రీధర్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా హౌసింగ్‌బోర్డు ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన భారతి హోళికేరి పోస్టింగ్‌ను రద్దు చేసి, ఆమెను ప్రస్తుతం ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా కొనసాగాలని పేర్కొంటూ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగులు...
ఈ మధ్యనే ఐఏఎస్‌లుగా ఎంపికైన ఆరుగురు అధికారులకు ప్రభుత్వం శిక్షణ నిమిత్తం వివిధ జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా నియమించింది. డాక్టర్ ఎన్.సత్యనారాయణ (నల్లగొండ), డాక్టర్ సి.శ్రీధర్ (కృష్ణా), ఎ.మహ్మద్ ఇంతియాజ్ (నెల్లూరు), పి.కోటేశ్వరరావు (రంగారెడ్డి), ఎస్.అరవింద్‌సింగ్ (వరంగల్), ఎం.ప్రశాంతి (హైదరాబాద్) ఆరు నెలల పాటు శిక్షణ పొందుతారు.

గవర్నర్ వద్దకు ‘ప్రాసిక్యూషన్ ఫైళ్లు’!
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన.. తన మార్క్ చూపిస్తున్న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్.. తొలి ఝలక్‌గా మాజీ సీఎం చివరి సంతకాలపై నజర్.. ఈ పరిణామాలను బేరీజు వేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కోర్టు మెట్లు ఎక్కించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాసిక్యూషన్ అనుమతుల ఫైళ్ల అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంగళవారం గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఖాన్.. ప్రాసిక్యూషన్ అనుమతి అంశాన్నీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ లేఖపై రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన వచ్చి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు లభిస్తాయని ఏసీబీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
ఆక్టోపస్ పగ్గాలు జేవీ రాముడికి...
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ  చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) డెరైక్టర్ జనరల్ తేజ్‌దీప్ మీనన్‌ను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా, ఆక్టోపస్ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఎస్‌పీఎఫ్ డీజీగా బదిలీ చేసింది. ఆక్టోపస్ బాధ్యతలను రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం  డీజీపీ జాస్తి వెంకటరాముడుకు అప్పగించింది. కాగా ఇంటెలిజెన్స్ ఎస్పీ రవికృష్ణను ఏపీఎస్పీ నాల్గో బెటాలియన్ (మన్ననూర్, వరంగల్) కమాండెంట్‌గా బదిలీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement