నల్లారి వారి నయా డ్రామా.. కమలం పువ్వు చెవిలో పెట్టుకుని.. | Sakshi
Sakshi News home page

నల్లారి వారి నయా డ్రామా.. కమలం పువ్వు చెవిలో పెట్టుకుని..

Published Thu, Apr 4 2024 8:55 PM

What Is The Political Future Of Nallari Kiran Kumar Reddy - Sakshi

ఆయన యాక్సిడెంటల్‌గా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ను నట్టేట ముంచి చెయ్యి వదిలేసి వెళ్ళిపోయారు. సొంతంగా పార్టీ పెట్టుకుని విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యారు. తర్వాత మూడేళ్ళకు మళ్ళా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్‌ లేదని భావించి గత ఏడాది కమలం గూటికి చేరుకున్నారు. తాజా ఎన్నికల్లో ఏపీలో ఎంపీగా బరిలో దిగారు. ఆ నాయకుడు ఎవరో ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఆయన రాజకీయాలు ఎలా సాగాయో పరిశీలిద్దాం

1989లో చిత్తూరు జిల్లా వాయల్పాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి ఎన్నికవ్వడం ద్వారా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలైంది. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా అవకాశం లభించింది. ఐదేళ్ళ పాటు వైఎస్‌ నమ్మినబంటుగా ఉంటూ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా కొనసాగారు. 2009లో డాక్టర్ వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించింది. రోశయ్య సీఎంగా ఉన్నకాలంలోనే అసెంబ్లీ స్పీకర్‌ పదవిలో ఉంటూనే..ఢిల్లీకి పదే పదే తిరిగి కాంగ్రెస్ హైకమాండ్‌ను బుట్టలో వేసుకున్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 2010 నవంబర్‌లో రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

తెలంగాణ ఉద్యమం పీక్స్‌కు చేరడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే విభజనను అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ..ఆఖరి బాల్ తన దగ్గర ఉందంటూ తెలంగాణ ప్రజల్ని బెదిరిస్తూ..ఆంధ్ర ప్రజల్ని నమ్మిస్తూ..2014లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాడి కిందపారేసి కాంగ్రెస్‌ను వదిలి వెళ్ళిపోయారు. ఢిల్లీకి..హైదరాబాద్‌కు పదే పదే తిరిగి కాంగ్రెస్ పెద్దలకు ఏవేవో చెప్పి వారిని నమ్మించి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు.

నమ్మి రాష్ట్రాన్ని అప్పగించిన పార్టీని రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత నట్టేట ముంచి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. చివరి వరకు పదవిని అంటిపెట్టుకుని ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా ఏపీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. జై సమైక్యాంధ్ర పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు దక్కలేదు. ఆఖరుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన తమ్ముడు కూడా ఘోరంగా ఓడిపోయారు.

అటు కాంగ్రెస్‌ పార్టీని..ఇటు ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఎన్నికల తర్వాత కొన్నాళ్ళ పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇలాగే సైలెంట్‌గా ఉండిపోతే రాజకీయ భవిష్యత్‌కు చేతులారా సమాధి కట్టుకోవడమే అవుతుందని భావించి సైకిల్‌ ఎక్కాలా? మళ్ళీ చేయి పట్టుకుని నడవాలా అని కొన్నాళ్ళ పాటు తర్జన భర్జన పడ్డారు. చివరికి 2018 జులైలో తన సొంత పార్టీని రద్దు చేసుకుని.. రాహుల్ గాంధీ సమక్షంలో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాని 2019 ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయడానికి సాహసించలేకపోయారు. కాంగ్రెస్‌లో అసలు ఉన్నారా ? లేరా? అన్నట్లుగా కొనసాగి గత ఏడాది ఏప్రిల్‌లో రెండోసారి హస్తానికి హ్యాండిచ్చి భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు.

2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో ఉన్నా.. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నా..2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టించడంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు, చంద్రబాబుకు కిరణ్‌కుమార్‌ పూర్తిగా సహకరించారు. తెలుగుదేశంలో చేరకపోయినా.. పచ్చ మందకు అడుగడుగునా సహకరిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు టీడీపీ కూటమిలో బీజేపీ చేరడంతో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తనకంటూ ఓట్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఛీత్కరించడంతో పాటు.. చివరి వరకు మోసపు మాటలతో కాలం గడిపిన కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఛీ కొట్టారు. అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు.

తాజా ఎన్నికల్లో మూడు పార్టీలు జట్టు కట్టడంతో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి కిరణ్‌కుమార్‌ రెడీ అయ్యారు. కాని రాజంపేటలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కుటుంబానికి చెందిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచి ప్రజాదరణతో, వైఎస్ జగన్‌ ఆశీస్సులతో మూడోసారి మిధున్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించి.. కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేసి.. ఇప్పుడు కమలం పువ్వును చెవిలో పెట్టుకుని ప్రజా సేవకుడిలా పోజు పెట్టి రాజంపేటలో పోటీ చేస్తే కిరణ్‌ కుమార్‌రెడ్డిని ప్రజలు నమ్ముతారా? 

Advertisement
 
Advertisement
 
Advertisement