రాజంపేటలో టీడీపీకి షాక్!
ఆది నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్లకు మొండిచేయి
రాజంపేట పార్లమెంటు స్థానం బీజేపీకి దక్కడంతో అభ్యర్థుల్లో ఆందోళన
మదనపల్లెలోనూ కష్టపడిన వారికి కష్టకాలం
సాక్షి రాయచోటి: తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆవిర్భావం నుంచి అండగా ఉంటున్న వారికి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు దాపురించాయి. ‘కష్టకాలంలో అండగా ఉన్నారు...అన్ని విధాల ఆదుకోవడంతోపాటు టికెట్ కూడా మీకే’ అంటూ ఊసరవెళ్లి మాటలతో పార్టీ పెద్దలు బురిడీ కొట్టించారు. పొత్తుల మాయో...లేక బాబు జిత్తులో...డబ్బుల మూటలు తీసుకురాలేరనో గానీ... ఆది నుంచి ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో శృంగభంగం తప్పలేదు.
జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కొత్త అభ్యర్థులను తెరమీదికి తేవడంతో గరంగరంగా ఉన్న ‘దేశం’ శ్రేణులకు తాజాగా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ అలజడి ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లాలో అధికంగా ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్న నేపధ్యంలో ఎన్నికల్లో దెబ్బ తగులుతుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది.
‘సుగవాసి’ కుటుంబానికి ఎగనామం
రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులు సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్‌బాబు టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సుగవాసి బాలసుబ్రమణ్యంకు రాజంపేట పార్లమెంటు సీటు కేటాయించినట్లు అంతర్గతంగా చెప్పడంతో ఆయన రెండు నెలలుగా అనునిత్యం తిరుగుతున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా తనను బలపరచాలని జిల్లాలో తిరుగుతూ...మరోవైపు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
ఈ తరుణంలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి అప్పజెప్పడంతో కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే సుగవాసి వర్గీయులు సంబంధిత పార్టీ కార్యాలయాల వద్ద టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా తొలగించారు.
మదనపల్లె, రాయచోటిలోనూ అంతర్గత పోరు
జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లోనూ టీడీపీ అంతర్గతపోరుతో సతమతమవుతోంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్‌బాషాను ప్రకటించడంతో అప్పటి నుంచి టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్ కినుక వహించారు. మరోవైపు రాయచోటిలో ఇదివరకే మండిపల్లికి టికెట్ కేటాయించినా.. అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి స్తబ్దుగా ఉండిపోయారు.
రాజంపేట టికెట్‌పై ప్రతిష్ఠంభన
కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీకి పనిచేసిన వారికి సంబంధం లేకుండా టిక్కెట్లు అధిష్టానం కేటాయించడంపై శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజంపేట టీడీపీ టిక్కెట్‌కు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి లేదా సుగవాసి కుటుంబానికి సంబంధించిన బాలసుబ్రమణ్యంకు కేటాయిస్తారని చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు జనసేనకు టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గ టీడీపీలో ఉత్కంఠ నెలకొంది.
కోడూరులో నైరాశ్యం
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాకుండా రైల్వేకోడూరు టికెట్‌ను జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం అలుముకుంది. ముందే గ్రూపు రాజకీయాలతో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేనకు టిక్కెట్ కేటాయించడంతో టీడీపీలో అనిశ్చితి నెలకొంది. పైగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ రూపానందరెడ్డి సూచించిన అభ్యర్థికి కాకుండా కొత్త అభ్యర్థికి టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి.
చంద్రబాబు జిత్తులకు బలైన మరో నేత, పారిశ్రామికి వేత్త గంటా నరహరి..
గంటా నరహరి టీడీపీ తరఫున ముందుగా రాజంపేట లోక్‌సభ స్థానం టికెట్ ఆశించారు. ఈ క్రమంలో పట్టణంలో అన్న క్యాంటీన్ ను సొంత డబ్బుతో నిర్వహించారు. తాజాగా రాజంపేట లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
తనకు ఎమ్మెల్యే టికెట్ అయినా వచ్చేస్తుందని గంటా నరహరి ఆశించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే అభ్యర్థికి ఖరారైందని తెలిసి చివరికి మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారనే విషయం మరోసారి గంటా విషయంలో బహిర్గతమైందని రాజకీయపరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment