Rajampet Lok Sabha: లోకల్ లీడర్ vs గెస్ట్ పొలిటిషన్ | Kiran Kumar Reddy Vs Mithun Reddy in Rajampet Loksabaha | Sakshi
Sakshi News home page

Rajampet Lok Sabha: లోకల్ లీడర్ vs గెస్ట్ పొలిటిషన్

Published Sun, Apr 14 2024 7:55 AM | Last Updated on Sun, Apr 14 2024 9:46 AM

Kiran Kumar Reddy Vs Mithun Reddy in Rajampet Loksabaha - Sakshi

 ఆరుదశాబ్దాల తర్వాత ఒకే సామాజిక వర్గం నేతల మధ్య పోరు  


 కూటమి నుంచి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 


 వైఎస్సార్‌సీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి 


 రెండుసార్లు దిగ్గజాలను మట్టి కరిపించిన మిథున్‌రెడ్డి  

 ఆసక్తికరంగా రాజంపేట లోక్‌సభ రాజకీయం 

అన్నమయ్య: రాజంపేట లోక్‌సభకు అరుదైనపోరు ఆవిర్భవించింది. ఆరుదశాబ్దాల తర్వాత ఏక సామాజికవర్గం మధ్య లోక్‌సభ ఎన్నికల రణరంగానికి రాజంపేట వేదికగా మారింది. ఈ లోక్‌సభపై రాష్ట్రం దృష్టి సారించింది. కారణం కూటమి అభ్యర్థిగా, బీజెపీ నుంచి ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీచేస్తుండగా, ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీ అయిన పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నుంచి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు రాజంపేట లోక్‌సభకు బలిజ,రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది. ఈ సారి ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే లోక్‌సభ ఎన్నికబరిలో ఉండటంతో అరుదైన పోరుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

1957 నుంచి...
రాజంపేట లోక్‌సభ ఆవిర్భవించిన తర్వాత 1957 నుంచి 2019 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు, చివరి రెండుసార్లు మినహా మొత్తం 12 సార్లు కాపు (బలిజ)లే దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థులుగా ఇద్దరు ఓకే సామాజికవర్గానికి వారు తలపడి 62 సంవత్సరాలు అయింది.

1962 తర్వాత..
2019 ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి తలపడి గెలుపొందారు. 2014లోనూ బీజెపీ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై పోటీ చేసి గెలుపొందడం విశేషం. 1962 తర్వాత ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోరు 2024 ఎన్నికల్లో ఆవిష్కృతంకావడంతో రాజంపేట లోక్‌సభ స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. బహుశా రాష్ట్రంలో కూడా రెండు ప్రధాన పార్టీల నుంచి ఒకే సామాజికవర్గం వారు పోటీ పడిన సందర్భం ఎక్కడా ఉండకపోవచ్చు.

9 సార్లు కాపుల మధ్యే పోరు
రాజంపేట లోక్‌సభ ఏర్పడిన 1957 నుంచి 2019 వరకు ఎన్నికల చరిత్రలోకి వెళితే...ఇప్పటికి 16సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో 1957లో టీవీఎన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కాగా , 1962లో ఇండింపెండెట్‌గా సీవీఎల్‌రెడ్డి చేతిలో టీవీఎల్‌ఎన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓటమిపాలయ్యారు. అంటే 1962లో ఇద్దరు ఒకే సామాజికవర్గ అభ్యర్థుల మధ్య పోరు జరిగింది. తర్వాత ఈ వర్గానికి మధ్య ఇప్పటి వరకు పోరు జరగలేదు. 1967లో బలిజ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనపై సీఎల్‌ఎన్‌రెడ్డి స్వతంత్య్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1971లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన పార్థసారధిపై,ఎన్‌సీవో పార్టీ అభ్యర్ధిగా యశోదరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1977లో మూడోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పార్థసారధి, బీఎల్‌డీ అభ్యర్ధి తిమ్మారెడ్డి పై పోటీ చేసి గెలుపొందారు. 1980లో నాలుగోసారి పార్థసారధి కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా పోటీచేశారు.

ఈ సారి బలిజ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ (యు) అభ్యర్థిగా ఆర్‌,సభాపతిపై పోటీ చేసి గెలుపొందారు. బలిజసామాజికవర్గానికి చెందిన 1984లో పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సాయిప్రతాప్‌ గెలుపొందారు. 1989లో సాయిప్రతాప్‌, టీడీపీ నుంచి పోటీ చేసిన సీ.రామచంద్రయ్యపై గెలుపొందారు. 1991లో సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయగా, పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1996లో సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా , టీడీపీ అభ్యర్థి పోతురాజు ప్రతాప్‌పై పోటీ చేసి గెలుపొందారు. 1998లో టీడీపీ అభ్యర్థి గునిపాటిరామయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో గునిపాటి గెలుపొందారు. అంటే 1977 నుంచి 2004 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో బలిజసామాజికవర్గం అభ్యర్థుల మధ్య పోటీ సాగింది.

నాలుగుసార్లే...
2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సాయిప్రతాప్‌ టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి ,బీజెపీ అభ్యర్థి పురందేశ్వరిపై గెలుపొందారు. 2019లో మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై పోటీ చేసి గెలుపొందారు. అంటే మొత్తం 67 నుంచి జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు రెడ్డి, బలిజ అభ్యర్ధుల మధ్య పోటీ జరగ్గా , మిగతా అన్నిసార్లు బలిజ,బలిజల మధ్యే ఎన్నికల పోరు కొనసాగింది.

లోక్‌సభ స్వరూపమిలా..
ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుచేశారు. ఇందులో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గం జిల్లాకేంద్రానికి దగ్గరగా ఉండటానికి చిత్తూరు జిల్లాలో కలిపారు.

► మిథున్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య పోరు... 
రాజంపేట సిట్టింగ్‌ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, మాజీ సీఎం నలారి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య పోరు సాగుతోంది.1962లో జరిగిన ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు రెడ్డి, రెడ్డి మధ్య జరగని పోరు ఈ సారి ఎన్నికల్లో ఆవిష్కృతం కావడంతో రాజంపేట పార్లమెంట్‌ పోరు అరుదైన ఘట్టంగా మారిందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement