పట్టు వదలని టీడీపీ నేతలు ! | - | Sakshi
Sakshi News home page

పట్టు వదలని టీడీపీ నేతలు !

Published Tue, Aug 13 2024 1:30 AM | Last Updated on Tue, Aug 13 2024 9:57 AM

-

ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం

ఓ బార్‌ యాజమానికి రెన్యువల్స్‌ చేయించవద్దని ఎమ్మెల్యే ద్వారా ఫోన్‌

కీలక నేతతో కలిసి విజయవాడ వెళ్లేందుకు సన్నాహాలు

సాక్షి ప్రతినిధి, కడప : కారు చౌకగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కొట్టేసేందుకు టీడీపీ నేతలు విఫలయత్నం చేస్తున్నారు. రెన్యువల్స్‌ చేయించవద్దని... లైసెన్సు ఫీజు చెల్లించవద్దని ఇప్పటికే కడపలోని బార్‌ యాజమానులతో రహస్య సమావేశం చేపట్టారు. తాజాగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆమేరకు ఇరువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ బార్‌ నిర్వాహకుడికి ఓ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్‌ చేసినట్లు సమాచారం. అందరు బార్‌ యాజమానులు ఏకతాటిపైకి వస్తున్నారు, తొందరపడి లైసెన్సు ఫీజు చెల్లించవద్దని సదరు ఎమ్మెల్యే చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఆ మేరకు టీడీపీ కీలక నేతతో కలిసి విజయవాడ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తిరిగి దక్కుతాయని గ్యారెంటీ ఏంటీ..?
ప్రభుత్వ నిబంధనలు మేరకు బార్‌ లైసెన్సు ఫీజు కేవలం రూ.40లక్షలు. పోటీ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఒక్కోక్క బార్‌ రూ.1.7 కోట్లు నుంచి రూ.1.89 కోట్లు వరకూ వేలంలో దక్కించుకున్నారు. ప్రస్తుతం 12 బార్లు ఉంటే అందులో రెండింటీని దౌర్జన్యంగా పచ్చ నేతలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అన్నీ బార్లు ఈనెల 20తేది లోపు లైసెన్సు ఫీజు చెల్లించి రెన్యువల్‌ చేయించుకోవాలని ఎకై ్సజ్‌శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఎవ్వరూ లైసెన్సు ఫీజు చెల్లించవద్దనే దిశగా అడుగులు వేస్తున్నారు. పునః టెండర్‌లో ఎవరి బార్‌ వారికే దక్కేలా ప్రణాళికలు చేద్దామని చెబుతున్నారు.

ఆశకు పోతే ‘బార్లా’పడతామా!
జిల్లా కేంద్రంలో అలా ఎవరి బార్‌ వారికే సొంతం చేసుకునే అవకాశం ఉంటుందా? పోటీ లేకుండా కడప, కమలాపురం నాయకుల వల్లే సాధ్యమౌతుందా? జిల్లాలో అధికార పార్టీ నేతలు ఎవరైనా తలదూరిస్తే పరిస్థితి ఏమిటి? పచ్చ నేతల మాట వింటే ఉన్న బార్‌ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమో? బార్‌ యాజమానుల్లో ఇలాంటి సందేహాలే వస్తున్నాయట. జిల్లా కేంద్రం ఎవరి గుత్తాధిపత్యం కాదు, ఎవరైనా పోటీలో పాల్గోంటారనే నగ్న సత్యాన్ని విస్మరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈపరిస్థితులల్లో బుధవారం కీలక నేతతో కలిసి విజయవాడ వెళ్లి ఎకై ్సజ్‌శాఖలో అసలేం జరుగుతుందో ఓ అంచనా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement