తంబళ్లపల్లెలో ఉద్రిక్తత
ఎమ్మెల్యే ఇంటివైపు వెళ్తుండగా టీడీపీ శేణుల్ని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగటంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారించి పలుసార్లు అడ్డుకున్నా ఖాతరు చేయకుండా నాలుగు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి వీరంతా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నివాసం వద్దకు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
సోమవారం నుంచి ఎమ్మెల్యే ఇంటివద్దే ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మంగళవారం అక్కడికి వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని భావించారు. ఈ సమాచారం తెలిసి డీఎస్పీ ప్రసాదరెడ్డి పలువురు సీఐలు, ఎస్సైలను రప్పించారు. పోలీసు అధికారులు టీడీపీ శ్రేణులను నిలువరించి వెనక్కి వెళ్లాలని సూచించినా.. పట్టించుకోకుండా మమ్మల్లే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారు.
కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి సమీపంలోని మదనపల్లి రోడ్డులోని లేఅవుట్ ఆర్చ్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులను మళ్లీ అక్కడ పోలీసులు నిలువరించారు. రెండు గంటలకు పైగా వారికి నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో టీడీపీ శ్రేణులు ఈలలు, సవాళ్లతో బిగ్గరగా కేకలు వేశారు.
దీంతో ఎమ్మెల్యే ఇంటివద్ద ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలతో గొడవలు సృష్టించేందుకు రెచ్చగొడుతున్నారన్న విషయం వారికి అర్థమైంది. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసేందుకు ములకలచెరువు సీఐ మధు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని వివరించి సంయమనం పాటించాలని కోరారు. తాము ఎమ్మెల్యేని కలిసేందుకు వచ్చామని, టీడీపీ శ్రేణుల వ్యవహారం తమకు తెలియదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తెలిపాయి. ఇంతలో టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు శృతిమించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీసులు రాత్రి 9 గంటలకు కూడా తంబళ్లపల్లెలో పోలీసు పహారా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment