ఇజ్రాయెల్‌నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది
టెల్-అవీవ్ పర్యటన వివరాలు వెల్లడించిన డీజీపీ జేవీ రాముడు
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అనువైన, అవసరమైన, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని డీజీపీ జాస్తి వెంకటరాముడు చెప్పారు. అక్కడి టెల్-అవీవ్‌లో గత వారం జరిగిన అంతర్గత భద్రతపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 ప్రజాస్వామ్య దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. భారత్ తరఫున దక్షిణాది నుంచి డీజీపీ హోదాలో తనతోపాటు ఉత్తరాది నుంచి అదనపు డీజీ, ఐజీ, డీఐజీలు ముగ్గురు వచ్చారనిచెప్పారు.
పోర్చుగల్, సైప్రస్, లాస్ ఏంజెల్స్, చికాగో పోలీసు చీఫ్‌లు, ఇంగ్లండ్ పోలీసు అధికారులు వక్తలుగా ప్రసంగించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ఇజ్రాయిల్‌ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సిందేనన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పటిష్టమైన కమ్యూనికేషన్స్ ఏర్పాటు, టెక్నాలజీ వినియోగం, ఆయుధాల సమీకరణ, వాడుతున్న ప్రొటెక్టివ్ గేర్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి ఏపీ సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.