పోలీస్‌ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు.. | Sakshi Interview With Best PCR Award Winner K Supraja | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..

Published Sat, Feb 6 2021 12:22 AM | Last Updated on Sat, Feb 6 2021 1:08 PM

Sakshi Interview With Best PCR Award Winner K Supraja

పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్‌–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్‌ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ నవాంగ్‌ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు.

► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి?
రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్‌ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.

► ట్రైనింగ్‌ సమయంలోని ఫిజికల్‌ ట్రైనింగ్‌ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా?
అవును. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్‌ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్‌ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది.

► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది?
జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్‌ చేస్తాను).  వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్‌ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్‌ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్‌ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి.

► లాక్‌డౌన్‌ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్‌మెంట్‌లో గొప్పగా చెబుతుంటారు!
(నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్‌ వార్డులు, అనాథల షెల్టర్‌ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్‌ఎస్‌ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం.

డీజీపి గౌతమ్‌ సవాంగ్‌ నుండి పిసిఆర్‌ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ
 


తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ
– కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement