Group-1 officers
-
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
టీఏఎస్ ఏర్పాటుకు అధ్యయనం
వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు రాష్ట్ర బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్–1 అధికారుల సంఘం, తెలంగాణ రెవెన్యూ జేఏసీ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల పర్యటనకు తెలంగాణ ఎన్జీవో సెంట్రల్ యూనియన్ ప్రతినిధులకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. టీఏసీలో కేడర్ సంఖ్య ప్రతిపాదనలు, టీఏసీ పరిధిలో ఉంచాల్సిన హెచ్వోడీలు, పోస్టులు, పోస్టుల వారీగా గ్రేడ్, స్కేల్ ఆఫ్ పే వివరాలు, టీఏసీ, రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అధికారుల ఎంపిక, ఎంపిక విధానం, టీఏసీల పదోన్నతుల విధానం, ప్రస్తుతం ఉన్న గ్రూప్–1 అధికారులను టీఏసీలో చేర్చటం, టీఏసీ అధికారులకు శిక్షణ, తరగతుల నిర్వహణ తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. -
ఉద్యమంలో గ్రూప్–1 అధికారుల పాత్ర ప్రశంసనీయం
► ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో గ్రూప్–1 అధికారుల పాత్ర ప్రశంసనీయమని ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ గ్రూప్–1 అసోసియేషన్ డైరీని నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, ఉద్యమంలో గ్రూప్–1 అధికారులు తమ హోదాలను పక్కన పెట్టి 2010లో నిర్మాణాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ, సహాయ నిరాకర ణ, సకలజనుల సమ్మె ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఏర్పాటుకు తమ వంతు పాత్ర పోషిం చామని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ సోమవారం గ్రూప్–1 అధికారులందరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. -
‘కన్ఫర్డ్ ఐఏఎస్’ వివాదం మళ్లీ క్యాట్‌కు.. పిటిషన్లను తిప్పి పంపిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 అధికారులకు పదోన్నతిపై ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) కల్పించే వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించి దాఖ లైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు తిప్పి పంపింది. వాటిపై వీలైనంత త్వరగా విచారించి నిర్ణయం వెలువరించాలని క్యాట్‌కు నిర్దేశించింది. అలాగే క్యాట్ తీర్పు ఇచ్చే వరకు కన్ఫర్డ్ ఐఏఎస్‌ల వ్యవహారంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హతలు ఉన్నా కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లను యూపీఎస్సీకి సిఫారసు చేయలేదంటూ పలువురు అధికారులు తొలుత క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన క్యాట్... ఐఏఎస్ హోదా పొందేందుకు అర్హులైన మరో ఆరుగురు అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుతాన్ని, అలాగే అవి అందిన తర్వాతే అర్హులైన వారి జాబితా రూపొందించాలని యూపీఎస్సీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిని సవాలు చేస్తూ కొంతమంది అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను తొలుత విచారించిన జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులను నిలుపు చేస్తూ, 30 మంది జాబితా ఆధారంగా యూపీఎస్సీ చేసే ఎంపికలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తాజాగా ఈ వ్యాజ్యాలు జస్టిస్ కె.సి.భాను నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకొచ్చాయి.