‘కన్ఫర్డ్ ఐఏఎస్’ వివాదం మళ్లీ క్యాట్‌కు.. పిటిషన్లను తిప్పి పంపిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 అధికారులకు పదోన్నతిపై ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) కల్పించే వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించి దాఖ లైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు తిప్పి పంపింది. వాటిపై వీలైనంత త్వరగా విచారించి నిర్ణయం వెలువరించాలని క్యాట్‌కు నిర్దేశించింది. అలాగే క్యాట్ తీర్పు ఇచ్చే వరకు కన్ఫర్డ్ ఐఏఎస్‌ల వ్యవహారంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అర్హతలు ఉన్నా కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లను యూపీఎస్సీకి సిఫారసు చేయలేదంటూ పలువురు అధికారులు తొలుత క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన క్యాట్... ఐఏఎస్ హోదా పొందేందుకు అర్హులైన మరో ఆరుగురు అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుతాన్ని, అలాగే అవి అందిన తర్వాతే అర్హులైన వారి జాబితా రూపొందించాలని యూపీఎస్సీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిని సవాలు చేస్తూ కొంతమంది అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను తొలుత విచారించిన జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులను నిలుపు చేస్తూ, 30 మంది జాబితా ఆధారంగా యూపీఎస్సీ చేసే ఎంపికలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తాజాగా ఈ వ్యాజ్యాలు జస్టిస్ కె.సి.భాను నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకొచ్చాయి.