బాధ్యతతో పనిచేయండి: డీజీపీ ప్రసాదరావు
పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ప్రసాదరావు సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇప్పటివరకూ ఎలాంటి పనివిధానం కొనసాగిందో అదేవిధంగా ముందుకు వెళ్లాలని ఉన్నతాధికారులకు డీజీపీ బి.ప్రసాదరావు సూచిం చారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అన్ని విభాగాల అదనపు డీజీలు, రీజియన్ ఐజీలు, రేంజ్ డీఐజీలు, ఎస్పీలతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమష్టి బాధ్యతతో పనిచేయాలని, అప్పుడే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పటికీ అవసరం లేని చోట్ల మార్పులంటూ అయోమయానికి గురిచేసే పరిస్థితి మాత్రం ఉండబోదని, పనితీరును మరింత మెరుగుపర్చాల్సిన చోట మాత్రమే మార్పులు చేద్దామని వారికి స్పష్టంచేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి టీపీ దాస్‌ను ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అభినందనలు
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నేతలు నూతన డీజీపీ ప్రసాదరావును మంగళవారం కలిసి అభినందనలు తెలిపారు. కానిస్టేబుల్ కుమారుడు డీజీపీగా ఎదగడం సంతోషించదగ్గ పరిణామమని వారు పేర్కొన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేస్తారని సంఘం నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వివేకానంద, కోశాధికారి బాలకృష్ణ, సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ అధ్యక్షులు శంకరరెడ్డి, భద్రారెడ్డి తదితరులు డీజీపీని కలిసినవారిలో ఉన్నారు.