అప్పటి నిధుల విభజన చెల్లదు...
* నిధులు వినియోగించకుండా ఏపీ ఇంటర్‌బోర్డును ఆదేశించండి
* హైకోర్టులో తెలంగాణ ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు ఇంటర్ బోర్డుకు వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.343 కోట్ల నిధులను ఇరు రాష్ట్రాల బోర్డులకు విభజన చేస్తూ అప్పటి బోర్డు కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఈ వ్యాజ్యం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ నగరంలో లేకపోవడంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఆస్తులను మిగిలిన సంస్థల అస్తి, అప్పులను విభజించినట్లు విభజించేందుకు సెక్షన్ 75 అనుమతించడం లేదు.
అయితే అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి తనకు లేని అధికారాన్ని ఉపయోగిస్తూ వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.343.5 కోట్లను 31.5.2014న ఇరు బోర్డులకూ విభజన చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రూ.200 కోట్లను ఏపీ ఇంటర్ బోర్డు పేరు మీద వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉన్నత విద్యా మండలి విషయంలోనూ ఇలానే నిధుల విభజన చేశారు. ఈ నేపథ్యంలో ఖాతాల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డుకు అనుమతినివ్వొద్దని బ్యాంకులకు లేఖలు రాశాయి. విషయం తెలుసుకున్న ఏపీ బోర్డు రూ.105 కోట్లను విజయవాడ ఆంధ్రాబ్యాంకుకు మళ్లించింది.
అయితే మిగిలిన బ్యాంకులు ఖాతాల నిర్వహణకు అనుమతినివ్వకపోవడంతో ఏపీ బోర్డు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు పొందింది. ఖాతాల స్తంభన నాటికి ఖాతాల్లో ఉన్న నిల్వలను అలా కొనసాగించాలని బ్యాం కులను హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఏపీ బోర్డు పేరు మీద విభజన చేసిన నిధులను విత్‌డ్రా చేయకుండా, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయండి. ఆ మొత్తాలను తమ కు వాపసు చేసేలా ఆదేశాలివ్వండి.’ అని తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.