కిరణ్ ప్లాప్ షో
- వెలవెలబోయిన సభలు
- చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
సాక్షి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఆదివారం ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. మూడు చోట్ల జనం పలుచగా హాజరయ్యారు. ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం ఓ మోస్తరుగా కనిపిం చారు. ఈ సభల్లో ఆయన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడని ఆరోపించారు. స్వగ్రామమైన నగిరిపల్లి నుంచి బయలుదేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత చంద్రగిరిలో జరిగిన సభకు హాజరయ్యారు.
ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి మమత వెంట తిరుపతి రూర ల్ మండలం నుంచి వచ్చిన రెండు వందల మంది మాత్రమే కిరణ్ సభలో కనిపించారు. చంద్రగిరి క్లాక్‌టవర్ సెంటర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కిరణ్ పది నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ అభ్యర్థి సీఆర్ రాజన్ ఆధ్వర్యంలో పెండ్లిమండపం సెంటర్‌లో జరిగిన సభలో ఆయన చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని ఇటీవల వరంగల్‌లో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కిరణ్ గుర్తు చేశారు. ఎక్కడా సమైక్యాంధ్రకు మద్దతు చెప్పని చంద్రబాబు మన జిల్లా వాసి కావడం మనందరి దురదృష్టమన్నప్పుడు సభకు హాజరైన జనం నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి నియోజకవర్గానికి వచ్చారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి అంబేద్కర్, గాంధీ విగ్రహాల మీదుగా నాలుక్కాళ్లమండపానికి చేరుకున్నారు. ఇక్కడ హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జేఎస్‌పీ పొత్తుపెట్టుకున్న సీపీఎం కార్యకర్తలు ఎక్కువగా ఈ సభలో కనిపించారు.
తిరుపతి లోక్‌సభ అభ్యర్థి సుబ్రమణ్యం, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ పెట్రోల్ బంక్, కరిమారియమ్మ జంక్షన్, మున్సిపల్ ఆఫీసు, ఘంటసాల విగ్రహం వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయా సెంటర్లలో తిరుపతి జేఎస్‌పీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసమీకరణ జరిగింది. అన్ని చోట్ల హాజరైన జనానికి అభివాదం చేసుకుంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి తన పర్యటనను ముగించారు.