బాబు అన్న పార్టీనా? అమ్మ పార్టీనా?: అంబటి
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నడుచుకుంటున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్న పార్టీనా? అమ్మ పార్టీనా? దయచేసి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అడిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసులకు భయపడి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అయ్యారన్నారు. రాష్ట్ర విభజన గురించి బాబుకు ముందే తెలుసని, అందుకే ప్యాకేజీ అడిగారని చెప్పారు. కేంద్రం సూచనల మేరకే చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పాత్రదారులన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇప్పటికైనా తెలుగుజాతిని మోసం చేయడం మానుకోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడానికి ప్రయత్నించాలని కోరారు.
మేకతోలు కప్పుకున్న పులిలా కిరణ్ సమైక్య ముసుగు వేసుకున్నారని విమర్శించారు. కొందరు సీమాంధ్ర మంత్రులు సర్వశక్తులు వడ్డుతామని చెప్పారు. వారు రోజుకో మాట మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. 104 రోజుల ఉద్యమ నేపధ్యంలో మంత్రుల ప్రకటనలు ఒకసారి పరిశీలించాలన్నారు. సీమాంధ్ర రాజధానికి లక్ష ఎకరాలు, 5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అడిగిన కిరణ్ సమైక్య సింహం ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన వెంటనే చంద్రబాబు ఇప్పుడు కిరణ్ అడిగినట్లే ప్యాకేజ్ అడిగారని గుర్తు చేశారు.
2014 వరకు రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే, ఆ తరువాత సమైక్యతకు మద్దతు ఇచ్చే పార్టీలే అధికారంలోకి వస్తాయని అంబటి చెప్పారు.