భయంతోనే విషప్రచారం: అంబటి | Ambati rambabu slams Congress, TDP | Sakshi
Sakshi News home page

భయంతోనే విషప్రచారం: అంబటి

Published Wed, Jan 22 2014 6:31 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

భయంతోనే విషప్రచారం: అంబటి - Sakshi

భయంతోనే విషప్రచారం: అంబటి

కాంగ్రెస్, టీడీపీపై ధ్వజమెత్తిన అంబటి
ఒకే పార్టీలో రెండు వాదనలు వినిపించే వారు సమైక్యవాదులా?
సమైక్యం కోసం పోరాడుతున్న జగన్ విభజనవాదా?
బినామీ చానళ్లు, పత్రికల్లో ఆ రెండు పార్టీల విషప్రచారం
ఎంత దుష్ర్పచారం చేసినా అంతిమ విజయం జగన్‌దే

 
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీని ఓడించే శక్తి జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది కనుక ఆ భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా జగన్‌పై విషప్రచారం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీకి పరస్పరం విభేదాలున్నప్పటికీ జగన్ విషయంలో మాత్రం ఒక్కటై దాడి చేస్తున్నారని విమర్శించారు. తమ విధానాలేమిటో సిద్ధాంతాలేమిటో ప్రజలకు చెప్పలేని అనిశ్చితిలో ఉన్న ఈ రెండు పార్టీలూ ఏం చేయాలో తోచక ప్రజలను గందరగోళపరచడానికి జగన్‌పై రకరకాలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒకే పార్టీలో రెండు వాదనలు వినిపిస్తున్న వాళ్లు సమైక్యం కోసం పోరాడుతున్న జగన్‌ను విభజనవాది అని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానంటే నేను వద్దంటానా?’ అని చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనలకు సంబంధించి పత్రికా ప్రతులను చూపుతూ ‘ఆయన విభజన వాది కాదా?’ అని నిలదీశారు.  సమావేశంలో అంబటి రాంబాబు ప్రస్తావించిన మరికొన్ని ముఖ్యాంశాలు...
 
     రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును సమైక్యవాది అని టీడీపీ నేతలు సీమాంధ్రలో ప్రచారం చేసుకుంటున్నారు. అదే పార్టీ తెలంగాణ నేతలు తమ నాయకుడు ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ వస్తోందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు తలో వాదం వినిపిస్తోంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు.
     రాష్ట్రాన్ని విభజించాలని తలపెట్టిన కాంగ్రెస్సే సమైక్య పార్టీ అని ముఖ్యమంత్రి చెబుతారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం తమది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే పార్టీగా చెప్పుకుంటారు.
     ఒక పార్టీలో టికెట్లు రానపుడు కొందరు అసంతృప్తి చెందుతారు. ఈ రెండు పార్టీలకు చెందిన కొన్ని పత్రికలు, బినామీ చానళ్లు అలాంటి వారిని రెచ్చగొట్టి అదే పనిగా జగన్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి.
     దేశంలోని ఏ రాజకీయ నాయకుని కుటుంబానికీ జరుగని విధంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపైనే ఇలాంటి దాడి జరుగడం అమానుషం.
     జగన్ ప్రతిష్ట రాష్ట్రంలో తగ్గిపోతోందని ఒక పత్రిక ప్రచారం చేస్తోందంటే... ఒకప్పుడు ప్రజాదరణ బాగున్నట్లు అంగీకరించినట్లే కదా! మరి జగన్‌కు జనంలో రేటింగ్ బాగుందని ఆ పత్రిక ఎప్పుడు రాసి చచ్చింది?
     దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2009లో కూడా ఈ పత్రికలు, మీడియా ఇలాగే దుష్ర్పచారం చేశాయి. కానీ, ప్రజలు వీరి రాతలను వమ్ము చేస్తూ గెలిపించారు. వాళ్లేమి రాసుకున్నా ఎంత దుష్ర్పచారం చేసినా అంతిమ విజయం జగన్‌దే.
     ట్యాంక్‌బండ్‌పై ఉన్నవి మట్టిబొమ్మలని, చెప్పులు వే శారని ఒకాయన విమర్శిస్తే... అపుడు మీ నాన్న ఎక్కడున్నారని మరొకరు విమర్శిస్తున్నారు. ఇలాంటి చెత్త మాట్లాడుకోవడానికా బిల్లుపై చర్చలో పాల్గొనమని మాపై ఒత్తిడి తెస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement