అంబటి రాంబాబు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీని ఓడించే శక్తి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది కనుకనే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా జగన్‌పై విషప్రచారంతో దాడి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీకి పరస్పరం విభేదాలున్నప్పటికీ జగన్ విషయంలో మాత్రం ఒక్కటై దాడి చేస్తున్నారని విమర్శించారు. తమ విధానాలేమిటో సిద్ధాంతాలేమిటో ప్రజలకు చెప్పలేని అనిశ్చితిలో ఉన్న ఈ రెండు పార్టీలూ ఏం చేయాలో తోచక సమైక్యం ముసుగులో ఉన్న విభజనవాది జగన్ అంటూ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళ పెడుతున్నాయన్నారు.
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును సమైక్యవాది అని టీడీపీ నేతలు సీమాంధ్రలో ప్రచారం చేసుకుంటున్నారని అదే పార్టీ తెలంగాణ నేతలు తమ నాయకుడు ఇచ్చిన లేఖ వల్లనే తెలంగాణ వస్తోందని చెప్పుకుంటారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించాలని తలపెట్టిన కాంగ్రెసే సమైక్య పార్టీ అని ముఖ్యమంత్రి చెబుతారని, ఉపముఖ్యమంత్రి దామోదరరాజనరసింహ మాత్రం తమది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే పార్టీగా చెప్పుకుంటారని అంబటి ఎత్తి చూపారు. ఇలా ఒకే పార్టీలోనే తలో వాదం వినిపిస్తున్న వాళ్లు సమైక్యం కోసం పోరాడుతున్న జగన్‌ను విభజనవాది అని విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు తలో వాదం వినిపిస్తోంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానంటే నేను వద్దంటానా?’ అని చంద్రబాబు గతంలో చేసిన ప్రకటన తాలూకు పత్రికా ప్రతులను అంబటి చూపుతూ ఆయన విభజన వాది కాదా అని ప్రశ్నించారు.ఈ పార్టీలకు చెందిన కొన్ని పత్రికలు, బినామీ చానెళ్లు కలిసి పనిగట్టుకున్న జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు పుట్టించి ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ఒక పార్టీలో టికెట్లు రానపుడు కొందరు అసంతృప్తి చెందుతారని అలాంటి బాధతో ఉన్న వారిని రెచ్చగొట్టి కొన్ని చానెళ్లు అదే పనిగా జగన్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుని కుటుంబానికీ జరుగని విధంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపైనే ఇలాంటి దాడి జరుగడం అమానుషం అని ఆయన అన్నారు. జగన్ ప్రతిష్ట రాష్ట్రంలో తగ్గిపోతోందని ఒక పత్రిక ప్రచారం చేస్తోందనీ, అంటే జగన్‌కు ఒకప్పుడు ప్రజాదరణ బాగున్నట్లు ఆ పత్రిక అంగీకరించినట్లే కదా అని ఆయన అన్నారు. జగన్‌కు జనంలో రేటింగ్ బాగుందని ఎపుడు ఈ పత్రిక రాసి చచ్చింది కనుక అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2009లో కూడా ఈ పత్రికలు, మీడియా ఇలాగే దుష్ర్పచారం చేశాయని అయితే ఎన్నికల్లో వీరి రాతలను వమ్ము చేస్తూ ప్రజలు గెలిపించారని అంబటి గుర్తు చేశారు. వీళ్లేమి రాసుకున్నా ఎంత దుష్ర్పచారం చేసినా అంతిమ విజయం జగన్‌దేనని, ప్రజలదేనని ఆయన అన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్నవి మట్టిబొమ్మలని, చెప్పులు వేశారని ఒకాయన విమర్శిస్తే, అందుకు ప్రతిగా అపుడు మీ నాన్న ఎక్కడున్నారని మరొకరు అసెంబ్లీలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని, ఇలాంటి చెత్త మాట్లాడుకోవడానికా బిల్లుపై చర్చలో పాల్గొనమని తమ పార్టీపై ఒత్తిడి తెస్తున్నది అని అంబటి ప్రశ్నించారు.