బుద్ధి, జ్ఞానం అంటే బూతు మాటలా ?: అంబటి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల ప్రశ్నించడం తప్పవుతుందా? అని ఆయన అన్నారు. బుద్ధి, జ్ఞానం అన్న మాటలు బూతు పదాలా? అని అంబటి ఘాటుగా ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ గతంలో పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేల విషయంలో కుట్ర జరగలేదా? అని ఆయన మండిపడ్డారు. ప్రజల హక్కులను కాలరాసేలా నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అంబటి చెప్పారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యల్లో పెద్ద వ్యత్యాసం లేదని ఆయన అన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లది ఒకే వైఖరిగా ఉందని చెప్పారు. చంద్రబాబు తమరు ఎందుకు రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వడం లేదని అంబటి రాంబాబు అడిగారు. అలాగే సమైక్య సింహం అంటున్న సీఎం కిరణ్ విభజన బిల్లును ఎందుకు తిప్పిపంపలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్ మనోహర్ అధిష్టానం ఆదేశాలమేరకే నడుస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, స్పీకర్‌కే కాదు సామాన్య ప్రజలకు కూడా ప్రివిలైజ్ ఉంటుందని అంబటి రాంబాబు చెప్పారు.