కేసీఆర్.. కాస్కో
అస్త్రశస్త్రాలతో ఎదురుదాడికి సిద్ధమవుతున్న టీపీసీసీ
‘కేసీఆర్-వంద అబద్ధాలు’ పుస్తకానికి రూపకల్పన
డీఎస్, దామోదర్, జానారెడ్డితో విడివిడిగా సమావేశమైన పొన్నాల
విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో ముందుకెళ్దామని ప్రతిపాదన
టీఆర్‌ఎస్ దూకుడుకు చెక్ పెట్టాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిపై యుద్ధానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సన్నద్ధమైంది. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రధాన లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకు కేసీఆర్ చెప్పిన మాటలు, వాటిని మార్చుకున్న తీరును ఎండగడుతూ... ‘కేసీఆర్-వంద అబద్ధాలు’ పేరిట ప్రత్యేకంగా బుక్‌లెట్ రూపొందిస్తున్నారు. పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో చోటు ఉండబోదని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాటతప్పి కుటుంబ సభ్యులందరినీ పార్టీలోకి తీసుకువచ్చిన వైనాన్ని ఇందులో వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించి మాటతప్పిన తీరును పుస్తకంలో చేర్చనున్నారు. అధికార దాహం, రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ ఏ పార్టీతోనైనా జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, 2004, 2009 ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించిన తీరు, 2009 ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ పంచన చేరిన వైనాన్ని కూడా వివరించనున్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, ఆయన విశ్వసనీయతలేని వ్యక్తి అనే అంశం ప్రజలకు అర్థమయ్యేందుకు ఆయన ఆడిన అబద్ధాలే నిదర్శనంగా పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. వారం రోజుల్లో పుస్తకాన్ని రూపొందించి విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు.
సీనియర్‌లతో చెక్
టీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతోపాటు కేసీఆర్ నైజాన్ని ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ రంగంలోకి దింపాలని పొన్నాల నిర్ణయించారు. అందులో భాగంగా ఆయన మంగళవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసాలకు వెళ్లి వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం యత్నించి భంగపడిన ఆయా సీనియర్ నేతలు పొన్నాలతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొన్నాల వారితో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఆయా నేతలను కలిసినట్లు పొన్నాల చెబుతున్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు టీఆర్‌ఎస్ దూకుడు ఏ విధంగా బ్రేకు వేయాలనే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందున ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలందరిపైనా ఉన్నందున విభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పొన్నాల ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఛాంపియన్‌గా టీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళుతున్నందున దానిని అడ్డుకుంటూ అసలు సిసలైన ఛాంపియన్ కాంగ్రెస్సేననే అంశాన్ని, ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సీమాంధ్రను ఫణంగా పెట్టిన విషయాన్ని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు సోనియాగాంధీ చేసిన కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇచ్చిన మాటమీద నిలబడే వ్యక్తి సోనియాగాంధీ అయితే అవసరానికి అబద్ధాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుకునే వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా సోదాహరణంగా వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇకపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కోరోజు ఒక్కొక్కరు చొప్పున గాంధీభవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను ఎండగడతారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.