అనుమానంతోనే ఆ కేసులు..! | Kommineni Srinivasa Rao interview with Ponnala Laxmaiah | Sakshi
Sakshi News home page

అనుమానంతోనే ఆ కేసులు..!

Published Wed, Mar 8 2017 4:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

అనుమానంతోనే ఆ కేసులు..!

అనుమానంతోనే ఆ కేసులు..!

కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య

(మనసులో మాట)
అక్రమాస్తులు తదితర అంశాలపై సీబీఐ పెట్టిన కేసులు ఏవీ నిలబడవని మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. కేవలం అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపణలు చేశారని, వైఎస్‌ జగన్‌తోపాటు కొందరిపై కేసులు కూడా పెట్టించారనీ, కానీ అవేవీ నిలవవని చెప్పారు.

క్యాంప్‌ ఆఫీసులో వైఎస్సార్‌ని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్‌  తారసపడ్డారు తప్పితే ఏదైనా పని విషయంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్‌  చేయలేదం టున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఫోన్‌ చేయడమూ తప్పే, కేసీఆర్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడమూ తప్పే.. అన్నారు. వైఎస్‌ మరణానికి ముందు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనలపై పొన్నాల అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భం?
ఒక లక్ష్యంతో నేను అమెరికాలో ఉద్యోగం మాని దేశానికి తిరిగి వచ్చాను. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగులకు, నైపుణ్యం లేని వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుం టుంది అని ఉండేది. ముఖ్యంగా ఫౌల్ట్రీ రంగంలో అవకాశాల కల్పన. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఫౌల్ట్రీ ప్రారంభించాం. ఆరోజుల్లో దేశంలో అయిదారు లక్షల మంది ఈ రంగంలో పనిచేసేవారు. మావంటి వారి కృషి వల్లే ఈ రోజు దేశంలో పది కోట్లమంది ప్రజలు పౌల్ట్రీ రంగంలో అవకాశాలు పొందుతున్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం గురించి చెబుతారా?
1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో హోమంత్రిగా ఉన్న ప్రభాకరరెడ్డి ద్వారా వైఎస్‌తో పరిచయం కలిగింది. మా మామగారితో తనకున్న పరిచయం వల్ల ఆయన నన్నూ దగ్గరకు తీసుకున్నారు. తర్వాత వైఎస్సార్‌ మంత్రి అయ్యారు. 1985లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. అప్పుడే శ్రీశైలం ఘటన జరిగింది.

శ్రీశైలం ఘటన అంటే?
1985లో అనుకుంటాను. వైఎస్‌ తన కుటుంబంతోపాటు శ్రీశైలం వెళుతూ మమ్మల్ని ఆహ్వానించారు. ఫ్యామిలీస్‌తో వెళ్లాం. దర్శనం చేసు కున్నాక, లుంగీ, పైన బనియన్‌ కట్టుకుని ఉన్న ఒక వ్యక్తి మావద్దకు వచ్చి వైఎస్‌ కాళ్లకు దండం పెట్టాడు. మీరెప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి సర్‌ అని వైఎస్‌ని ఉద్దేశించి చెప్పాడు. వైఎస్‌ నవ్వి ముందుకు నడుస్తూ, ‘‘అలాంటి అవకాశం మనకు వస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఏర్పాట్లు చేయగలుగు తామా’’ అన్నారు. సీఎం కాగానే సాగునీరు కల్పించాలి అని అంటున్నారంటే రాయల సీమలో నీటి కష్టం ఆయనపై ఎక్కువ ప్రభావం వేసిందనుకున్నాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2004లో సీఎం కాగానే జలయజ్ఞం, 86 ప్రాజెక్టులు, శాశ్వత ప్రాతిపదికన గోదావరి–కృష్ణ జలాలను వాడుకునేటటువంటి మహోన్నత యజ్ఞం ప్రారంభించారు. ప్రపంచంలోనే విశిష్టమైన ఆ ఘటనలో అవకాశం దక్కడం నా అదృష్టం.

జలయజ్ఞం నేపథ్యం ఏమిటి?
జలయజ్ఞం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కర్నూలులో జరిగిన ఒక మీటింగులో వైఎస్‌ నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేను సాగునీటి కల్పన గురించి మాట్లాడాను. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనం ఇంత గొప్ప ప్రాజెక్టును చేపడుతున్నాము. భావితరాల కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శాశ్వత ప్రాతిపదికన దీన్ని తీసుకువస్తున్నాం. వ్యవసాయ అభివృద్ధి కోసం దీన్ని ఒక యజ్ఞంలా చేయాలి చేద్దాం అని మాట్లాడాను. వెంటనే వైఎస్‌ తన స్పీచ్‌ మొదలెట్టి ఇది జలయజ్ఞం అని పేరుపెట్టేశారు.

అలాగే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. నెహ్రూ అప్పట్లో ఈ ప్రాజెక్టును ఆధునిక దేవాలయమని పిలిచారు. కాని 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ప్రాజెక్టు తరగని బంగారు గనిలా మారింది. ఎందుకంటే ఒక కారుకు 9 వేల కోట్ల రూపాయల పంటను అందిస్తోంది. అంటే సమాజానికి, దేశానికి, ప్రాంతానికి ఎంత సంపదను ఇది సృష్టించి ఇస్తోందో చూసినట్లయితే ఇది ఆధునిక దేవాలయంతోపాటు తరగని బంగారు గనిలా తయా రైంది. మామూలు బంగారు గని అయితే బంగారు తోడేశాక కొంతకాలానికి వట్టిపో తుంది. కాని ఇది తరగని గనిలాగా ప్రతి ఏటా, ప్రతి కారుకూ వేల కోట్ల సంపద నిస్తోంది. కాబట్టే ఇది తరగని బంగారు గని అని వైఎస్‌ చెప్పారు.

145 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా అధిష్టానం జగన్‌కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?
అధిష్టానానికి మా అభిప్రాయాలు చెబుతూనే చివరి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వడం రివాజు. జగన్‌కి మద్దతు తెలిపాం. సంతకాలు పెట్టాం. కానీ అధిష్టానం ఎందుకో మరోలా ఆలోచించింది. ఆ విషయం తెలిసినప్పుడు బాధపడ్డాం.  

జగన్‌నే సీఎంగా చేసి ఉంటే చరిత్ర మరోలా ఉండేది కదా?
అవకాశాలు కల్పించి ఉంటే ఆయనకు ఇక ఆకాశమే హద్దు కదా.

కేసీఆర్‌ దీక్ష బూటకం అని చాలామంది అంటున్నారే?
ఆ దీక్ష బూటకం అని నేనే చెప్పాను. 750 కేలరీల ద్రవాహారాన్ని తీసుకుని దీక్షలో ఉన్నాడాయన. లక్ష్యసాధన కోసం కేసీఆర్‌ ఏం చేసినా మేం కాదనలేదు. నాకు తెలిసి ప్రాణానికి ఏమాత్రం ముప్పులేని దీక్షనే కేసీఆర్‌ చేశారు. కానీ ఆయన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని చిదంబరం తదితరులు అనుకున్నారు. ఆయన ద్రవాహారం తీసుకున్నా రన్నది నిజం. కానీ ఆ దీక్ష ఉద్యమానికి తోడ్పడింది.

కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటే జగన్‌పై ఏ కేసులూ ఉండేవి కాదు కదా?
మంత్రులుగా మామీద కూడా కేసులు పెట్టారు కదా మరి. పైగా పలానా డాక్యు మెంట్లో పలానా తప్పు ఉంది ఇదెలా వచ్చింది అంటూ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్షీ్మ నారాయణే మమ్మల్ని పిలిపించి వివరణలను అడిగారు. మేం  చెప్పాం. వాళ్లు అనుమా నాలు వ్యక్తం చేస్తే, వాస్తవాలు చెప్పాం.

సీబీఐ పెట్టిన కేసులపై మీ అభిప్రాయం?
అవి నిలబడవు. నాపై చార్జిషీట్‌ పెట్టలేదు. అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపిం చారు. అందుకే మా కేసులు నిలవవు అని అప్పుడే తెలుసు. ఇక  జగన్‌పై కూడా ఇలాగే కేసులు పెట్టి ఉంటారనుకుంటున్నాను. కోర్టులోనే  అవి తేలాలి.

మిమ్మల్ని కలవడానికి జగన్‌ ఎప్పుడైనా సచివాలయానికి  వచ్చారా?
ఆయనతో మాట్లాడటమే రెండు మూడు సందర్భాల్లో జరిగింది. అది కూడా  సెక్రటే రియట్‌లో కాదు. క్యాంప్‌ ఆఫీసులో ముఖ్య మంత్రిని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్‌ తారసపడ్డారు. ఏదైనా పని విష యంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్‌  చేయలేదు.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఫిరాయింపులపై మీరేమంటారు?
ఫిరాయింపులు జరగకూడదు. ఎవరు చేసినా, ఎవరు చేయించినా తప్పు తప్పే..!

ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం?
ఫోన్‌ చేసిన వారిదీ తప్పు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించినవారిదీ తప్పు. ఇప్పుడు ఎవరి  అవసరాలకు అనుగుణంగా వారు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాలకు చేసే పనులు, కక్షపూరితంగా చేసే పనులు అన్నిపార్టీల్లో ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్‌ పార్టీనే ఎందుకు వేలెత్తి చూపుతారు? అయితే ఇలాంటి పనులు మంచివి కాదనే నా అభిప్రాయం.
(పొన్నాల లక్ష్మయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement