తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం, వ్యతిరేకత ఏ కోశానా తనకు లేదని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకపోవడంతోనే ఆయనతో విభేదించవలసి వచ్చిం దని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ఆర్థిక నమూనా ఉండేదో ఆ నమూనానే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లకు లాభాలు తెచ్చిపెట్టే తరహా ప్రాజెక్టులపై తప్ప సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయడం లేదని విమర్శించారు. పౌరులుగా ప్రశ్నించే హక్కును ఉపయోగించుకుంటున్నందుకే తమలాంటివాళ్లను ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రిస్తున్నారంటున్న కోదండరామ్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
రాజకీయనేతగా అవతారమెత్తారు. మీ అభిప్రాయం?
తీవ్ర ఉద్రిక్తతలు, ఉద్వేగాల మధ్య నడిచిన ఉద్యమంలో పనిచేసిన అనుభవం నుంచి రాజకీయ పార్టీ నేతగా మారడానికి తీవ్రమైన మానసిక అంతర్మథనం, సన్నిహితుల ఒత్తిడి కారణం. అయితే జేఏ సీలో ఇంతవరకు పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయాల్లోకి దిగడం ఇప్పుడేం కొత్తగా అనిపించడం లేదు.
కేసీఆర్‌తో పడకే రాజకీయాల్లోకి వచ్చారా?
వ్యక్తులపై అసమ్మతితో నిర్ణయాలు తీసుకుంటే మనం నిలబడలేం. ఒక్కమాటలో చెప్పాలంటే గత నాలుగేళ్ల మా అనుభవం నుంచి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి విధాన రూపకల్పనలో తగు సలహాలు ఇవ్వాలనుకున్నాం. ఉద్యమంలో అనేక విషయాలు తెలిశాయి కాబట్టి తెలంగాణ వస్తే ఏం మార్పులు సాధించాలి అని జనం ఆకాంక్షలను అర్థం చేసుకున్నాం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని తెలిసిన విషయాలను ప్రభుత్వానికి చెప్పాలి అనుకున్నాం. కానీ ప్రభుత్వం అలాంటి సలహాలను మెల్లమెల్లగా పక్కనపెడుతూ వచ్చింది.
కేసీఆర్‌కూ, మీకూ మధ్య తగాదా ఎందుకొచ్చింది?
ఘర్షణలో వ్యక్తిగతమైనది ఏదీ లేదు. ఉద్యమకాలంలో ఏదయినా విభేదాలుంటే భిన్నాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు. కానీ వాటిని పక్కనబెట్టి కలిసి పనిచేశాం కాబట్టే తెలంగాణ సాధించగలిగాం.
గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ టిక్కెట్లు కొంతమందికి ఇప్పించారా? మీపై ఇదీ ఒక ఆరోపణ మరి?
మేం ఏ పార్టీకీ, ఎవరికీ ఫోన్ చేయలేదు. జేఏసీ నుంచి కొంతమంది మిత్రులు రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. పలానా వ్యక్తి జేఏసీలో పనిచేసిండు అని ధ్రువీకరించాలి కదా. జేఏసీ అధినేతగా మీరు చెబితే మంచిది కదా అని కొందరు అడిగితే నిజమేనండీ ఆయన జేఏసీలో పనిచేశారు. ఈయన ఉద్యమంలో ఉపయోగపడ్డాడు అని చెప్పాం అంతే. కేవలం కాంగ్రెస్‌కే కాదు టీఆర్‌ఎస్‌కు కూడా ఇదే చెప్పాం.
మీపై కాంగ్రెస్‌వాది అని ఎందుకు ముద్ర వేశారు?
టీజేఏసీలోంచి ఏ పార్టీలోకి వెళ్లి పోటీ చేయాలనుకున్నా వారందరికీ మేం సపోర్టు చేశాం. పలానావారు మా సంస్థకు చెందినవారే, క్రియాశీలకంగా ఉద్యమంలో పనిచేసినవారే అని ఆయా పార్టీల వారికి చెప్పాం. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఏ పార్టీలోకి మావాళ్లు అడిగినా అందరికీ సపోర్టు చేశాం. వీళ్లు పలానా సమయంలో, పలానా స్థాయిలో ఉద్యమానికి తోడ్పాటునందిం చారు. మీకూ ఉపయోగపడతారు అని సిఫార్సు చేశాం. వారి బలాబలాలు ఇవీ. మీరు ఉపయోగించుకుంటే మంచిదే అన్నాం.
టీజేఏసీనే ఎత్తేయాలని కేసీఆర్ చెప్పలేదా?
తెలంగాణ సాకారమయ్యాక ఇక చేసేదేమీ లేదు అనే అభిప్రాయం అయితే ఉండింది. కానీ జేఏసీలో మేమందరం మాట్లాడుకున్నాం. తెలంగాణను కిందో మీదో పడి సాధిస్తాం.కానీ అనేక రంగాల్లో తెలంగాణ ప్రజలకు కలగాల్సిన ప్రయోజనాలు ఏమిటి, అవన్నీ ప్రజలకు దక్కేలా చూడాలని అనుకున్నాం. అలాంటి పాత్రను మేం పోషించాలని, ఆ బాధ్యతను మర్చిపోకూడదని భావించాం. పైగా మా గురువు జయశంకర్ గారు తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం పనిచేయాలి, వచ్చాక రాష్ట్ర అభివృద్ధికోసం పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లేవారు వెళతారు. జేఏసీగా ఉండి పనిచేయాలనుకునేవాళ్లు చేస్తారు, చేయాలి అని తలిచాం.
కేసీఆర్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటి?
ప్రభుత్వంలో ఉన్నవారు నిన్నా మొన్నటి వరకు కలిసి పనిచేసిన వాళ్లే కదా. ప్రజల సమస్యలను పదింటిని తీసుకుని వెళ్లి చెబితే వాటిలో నాలుగైదు సమస్యలను పరిష్కరించినా ఆమేరకు ఉపయోగమే కదా అనుకున్నాం. ప్రధానంగా విభజనకు సంబంధించిన ఉద్యోగాల్లో క్లాస్ 4 ఉద్యోగులను మినహాయించాలని చెప్పాం. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని పంపకాల్లోకి నెట్టవద్దన్నాం. చిన్న స్థాయి ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడే ఉంటాయి. వాళ్లను తీసుకుపోయి వేరే ప్రాంతంలో నియమిస్తే వాళ్లు తట్టుకోలేరు. నిలబడలేరు. కిందిస్థాయిలో ఉన్నవారి వేర్లు స్థానికంగా ఉంటాయి. వాళ్లు వాటిని తెంచుకుని ఎక్కడికో వెళ్లలేరు అని చెప్పాం. పైగా వీరి జీతాలు తక్కువ. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు అంటే చాలా కష్టం. కాబట్టి వారిని బదిలీ చేయొద్దని గట్టిగా చెప్పాం.
రెండోది.. ప్రభుత్వ రంగ సంస్థల విభజన పట్ల నిశిత దృష్టి పెట్టాలి. వీటి విభజనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించాం. విద్యారంగానికి సంబంధించిన సంస్కరణలు ఏం చేయాలో కూడా చెప్పాం. అన్నీ మేమే చెబితే బాగుండదని రకరకాల వేదికలను బలోపేతం చేసి వాటి ద్వారా కూడా చెప్పించాం. మా సూచనల్లో వేటిపట్లా ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత్తర్వాత అర్థమైనదేమంటే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి పంథానే సరైంది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ఆర్థిక నమూనా ఉండేదో దాన్నే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల పట్లే దృష్టి పెట్టింది. వీటివల్ల ఎక్కువగా లాభపడేది కాంట్రాక్టర్లే కాని ప్రజలు కాదు. ఇవన్నీ గమనించాకే మనం పోవలసిన మార్గం ఇది కాదు అని మాట్లాడాం.
పాలకుడిగా కేసీఆర్‌కి ఎన్ని మార్కులిస్తారు?
ప్రశ్న ఒకటి అయితే సమాధానం ఒకటి చెపితే దానికి సున్నా మార్కులు తప్పితే ఏమన్నా వస్తాయా? ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణలో పనులు జరగలేదని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. అందరికీ బతుకుదెరువు చూపించాలి అన్నాం. ఇదే ఉద్యమ ఆకాంక్ష. ఇది ఉద్యమ ఆకాంక్షలను గుర్తిస్తున్న ప్రభుత్వం కాదు. ద్వేషంతో ఇలా అనడంలేదు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిని పల్లెత్తు మాట అనలేదు మేం. వారు ముఖ్యమంత్రిగా, మేం పౌరులుగా ఉంటుం డటం వల్ల తలెత్తుతున్న సమస్యలే ఇవి.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment