వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటెలిజెన్స్ విభాగానికి ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేయలేదని, సచివాలయంలో, ప్రభుత్వ సమావేశాల్లో ఆయన కనిపించడం నాకు తెలిసినంతవరకు ఎన్నడూ జరగలేదని ఉమ్మడి రాష్ట్ర డీజీపీ కె. అరవిందరావు తేల్చి చెప్పారు. అలాగే వైఎస్‌ఆర్ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేసిపెట్టాలని నిఘా అధికారులకు ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ వంటి ఘటనల్లో సీబీఐ అతిగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసు శాఖ అధికార పక్షానికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కానీ పూర్తి అనుకూలత ప్రదర్శిస్తే పోలీసు ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పేర్లను చార్జిషీటులో పోలీసులు నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసు పెట్టవచ్చన్నారు. హిందూమతం గురించి చదువుకున్నవారు ఎవరూ అసహనం చూపడానికి వీల్లేదని, నిజానికి మనవాళ్లు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనందువల్లే ఈ మతఛాందస వాదం పుట్టుకొస్తోందంటున్న అరవిందరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
కర్కశమైన లాఠీ నుంచి పూర్తి విరుద్ధమైన ఆధ్యాత్మికత వైపు ఎలా వెళ్లిపోయారు?
నాది ఆధ్యాత్మికం కాదండి. ఇది కూడా పోలీసు జాబే అనుకుంటున్నా. ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోయి భగవంతుడు, సాధన అనే ధోరణిలో ఉండటమే ఆధ్యాత్మికత అనుకుంటాం. నా ఉద్దేశంలో భగవద్గీత, ఉపనిషత్తులు చదివినవారు ఎవరూ సన్యాసి కారు. కానీ భగవద్గీత చెప్పినవాడు ఒక సోల్జర్ కాగా దాన్ని విన్నవాడు కూడా సోల్జరే. విన్న తర్వాత నా ధర్మమేమిటి అని తెలుసుకుని యుద్ధం చేశాడు. అందుకే ప్రపంచం గురించి మనగురించి ఒక పెద్ద చిత్రణనిస్తుంది భగవద్గీత. ఆధ్యాత్మికత కూడా పోలీసు జాబే అని ఎందుకన్నానంటే ఉదాహరణకు దేశం ఉంది, మన దేశంలో ఒక సంస్కృతి ఉంది. ఈ సంస్కృతి దేశరక్షణకు అవసరం. దేశరక్షణ, సమగ్రత అనేవి కేవలం పోలీసులపైనో, ఆర్మీపైనో ఆధారపడి ఉండవు. సంస్కృతి బలంగా లేకపోతే దేశ సమగ్రత కూడా బలంగా ఉండదు. అందుకే నేను వాల్మీకి రామాయణం కూడా ఇంగ్లిష్‌లో చెబుతున్నాను.
దేశంలో మత అసహనం, గోరక్షణ పేరిట దాడులు పెరగడంపై మీ వ్యాఖ్య?
మత అసహనం చాలా తప్పు. హిందూమతాన్ని చదువుకున్నవారు ఎవరూ అసహనం చూపడానికి వీల్లేదు. మన తత్వంలో అసహనం అనే మాటేలేదు. నీవు దేవుడిని ఏ రూపంలోనైనా పూజించు అనే సిద్ధాంతం ఇదొకటే. నిజానికి మనవాళ్లు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనందువల్లే ఈ మతఛాందస వాదం అనేది వస్తోంది. అవి చదివినవారు దాని జోలికి పోరు.
ఈ మధ్య కంచ ఐలయ్య పుస్తకంతో పెద్దవివాదం పుట్టుకొచ్చింది కదా?
ఐలయ్య కూడా కాస్త గీత దాటారు. ఆయన స్కాలర్. అలాంటప్పుడు వర్ణానికి, కులానికి మధ్య ఉన్న భేదాన్ని తాను తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడి నిర్వచనం ప్రకారం కంచ ఐలయ్య కూడా ఒక ద్విజుడు. అంటే బ్రాహ్మణుడు మాత్రమే కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మూడూ కలిపి ద్విజులు అని అర్థం. సేవలు చేసే వారు తప్ప మిగతా అందరూ ద్విజులే అని గీతార్థం. కాని ద్విజ వర్గంలో ఉండాల్సిన వారంతా తాము శూద్రులమని ఆపాదించుకుంటున్నారు. ఇదే పొరపాటు. అంతే తప్ప ఒక చిన్న కమ్యూనిటీని పట్టుకుని దేశాన్ని దోచుకుంటున్నారని అనడం పొరపాటు. వ్యాపారం లేకుండా ఏ సమాజమూ లేదు. బిజినెస్ లేకపోతే సమాజమే నిలవదు.
వైఎస్ రాజశేఖరరెడ్డితో మీ పరిచయం ఎలా ఉండేది?
మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. అదనపు డీజీ ఇంటెలిజెన్స్‌గా నన్ను ఆయన నియమించినప్పుడు సర్‌ప్రైజ్ అయ్యాను. అంతకుముందు కడప జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. ఆయన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన గౌరవానికి లోటు లేకుండా చేసేవాడిని. బహుశా అదే మనస్సులో ఉన్నట్లుంది. సీఎం అయ్యాక ఉన్నత పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయనతో మంచి సంబంధాలే ఉండేవి. ఆయన నన్ను పూర్తిగా విశ్వసించేవారు.. అలా విశ్వసించడం అంటే మనకు ఇక తిరుగులేనట్లే. వృత్తిగతంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎవరైతే వ్యక్తులపై నమ్మకం ఉంచుతారో వారు గొప్ప మనుషులన్నమాట.
సీబీఐ, పోలీసు శాఖ కాస్త పక్షపాతంతో వ్యవహరిస్తుంటాయి కదా?
సీబీఐలో నేను ఎప్పుడూ పనిచేయలేదు కాబట్టి నేను చెప్పలేను. సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ ఘటనలో నాపై కేసు విషయంలోనే నేను కొంత ఫీలయ్యాను. ఎందుకంటే ఆ చనిపోయిన వాడేం మహాత్ముడు కాదు. వ్యాపార వర్గాలను బెదిరించి కొల్లగొట్టడంలో రాటుదేలినవాడు. వాడు ఎలాంటి స్థితిలో చచ్చాడో మనకు తెలీదు. ఆ కేసు ఆధారంగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని పదవినుంచి దింపేయాలని భావించారేమో! కానీ సీబీఐ అందరినీ పట్టుకుని వేధించడం కాస్త అతి చర్య అనిపించింది.
ఏపీలో, తెలంగాణలో పోలీసులు అధికారపార్టీ చెప్పిందే చేస్తున్నారని విమర్శలు..!
రూలింగ్ పార్టీకి పోలీస్ శాఖ అంతో ఇంతో కాస్త అనుకూలంగానే ఉంటుంది. పూర్తిగా అయితే ఉండదు. అయితే పోలీసులపై నిందమోపడం ప్రతిపక్షం విధి. కొంత అనుకూలత ఉంటుందని నేను ఒప్పుకుంటాను. కానీ పూర్తిగా అధికారపార్టీకి అనుకూలంగా ఉండదు. అలా చేస్తే పోలీసు ఉద్యోగమే పోతుంది. పోలీసులు కొన్ని సందర్భాల్లో అధికారపార్టీ ఆదేశాలకు ప్రభావితం కావచ్చు. అలాగని సీఎం ఏది చెబితే దాన్ని పోలీసులు చేయాలని రూల్ ఏమీ లేదు.
వైఎస్‌ఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదికదా, ఆయన వైఖరి ఎలా ఉండేది?
వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఇలాంటివి చేయమని ఎప్పుడూ చెప్పలేదండి. చట్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేసిపెట్టమని ఆయన ఎన్నడైనా చెప్పినట్లు నాకు గుర్తు లేదు. క్రమ విరుద్ధంగా ఆయన నాకు ఏదీ చెప్పలేదనే నేను అనుకుంటున్నాను.
వైఎస్ జగన్ మీకు కానీ, సచివాలయానికి కానీ ఎన్నడైనా ఫోన్ చేసేవారా?
అస్సలు లేదండీ. జీరో. ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. శాంతిభద్రతలకు సంబంధించి వైఎస్ జగన్ నాకు చెప్పిందంటూ ఏమీ లేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రమేయం గురించి నాకు ఏమీ తెలీదు. ఆయన తొలినుంచి బిజినెస్ పనుల్లో ఉండేవారు కాబట్టి ఈ అంశంలో ఆయన పాత్ర గురించి నాకు తెలీదు. సచివాలయంలో, ప్రభుత్వ సమావేశాల్లో వైఎస్ జగన్ కనబడటం నాకు తెలిసి ఎప్పడూ లేదు. చాలావరకు ఆయన బెంగళూరులో ఉండేవారు. హైదరాబాద్‌లో ఆయన దాదాపు లేనే లేరు కదా.
ముద్రగడ పద్మనాభం కదిలితేనే నేరమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన పాదయాత్ర చేస్తేనే అడ్డుకోవడం సరైందేనా?
రాష్ట్రం విడిపోయింది కదా.. నాకు వివరాలు పూర్తిగా తెలీవు. పైగా హైదరాబాద్‌లో ఉంటున్నందున ఏపీ వార్తలు పేపర్లలో రావ డం తక్కువే. కానీ అలాంటి నిర్ణయాలు ఆ నిర్దిష్ట అధికారి వ్యక్తిగత నిర్ణయం మేరకే జరుగుతుంటాయి. అయితే ఆయన కదలడం వల్ల, పాదయాత్ర చేయడం వల్ల లక్షలా దిమంది కదిలి వస్తారా? మనకయితే తెలీదు. వైఎస్ జగన్‌ని విమానాశ్రయం రన్‌వే పైనే ఆపివేసిన ఘటన కూడా ఆ అధికారి వ్యక్తిగత అంచనాప్రకారమే జరిగి ఉంటుంది.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు పెట్టి, చార్జిషీట్‌లో చేర్చకపోవడంపై మీ వ్యాఖ్య?
ఆ కేసు వివరాలు నాకు తెలీదు. కానీ అకడెమిక్‌గా చెప్పాలంటే, పోలీసులు అలా చేయకపోతే, ప్రైవేట్ వాళ్లు కేసు వేసుకోవచ్చు. పోలీసు కేసుకు ఎంత చట్టపరమైన చెల్లుబాటు ఉంటుందో ప్రైవేటు కేసుకు కూడా అంతే చెల్లుబాటు ఉంటుంది. కాబట్టి పోలీ సులు పేరు చేర్చలేదంటే పెద్దగా ఫీల్ కానక్కరలేదు.
తెలుగు ప్రజలకు మీ సందేశం?
తెలుగు ప్రజలం కాబట్టి, తెలుగు భాషను కూడా మనం నిలుపుకోవాలి. భాష ద్వారానే మన సంస్కృతి నిలుస్తుంది. అభినందించాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలందరూ కలిసే ఉన్నారు. దానికి రెండువైపులప్రభుత్వాలనూ అభినందించాలి. ప్రజలనూ అభినందించాలి. ఇలాంటి సామరస్య వాతావరణం ఇంకా కొనసాగాలన్నదే నా ఆశ.
Comments
Please login to add a commentAdd a comment