పాదయాత్రలు సీఎం కావడం కోసం చేయరనీ, జనం సమస్యలను నేరుగా తెలుసుకోవడమే వాటి ఉద్దేశమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏపీ ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఉందన్నారు. కేంద్రం చేపట్టనిదే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటం కల్లోమాటే అన్నారు. అభివృద్ధిని కాదు.. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీని అడ్డుకుంటున్నామని, సాక్ష్యాధారాలతో సహా ఆయన అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆదరణ చూరగొని వైఎస్సార్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందంటున్న వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయం ఆయన మాటల్లోనే...
మీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ పాదయాత్ర ఎలా జరుగుతోంది?
పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకు దగ్గరగా వెళ్లి వారి కష్టాలను చూడటమే. మనం కారులోనో, మరే వాహనం లోనో వెళ్లి కలిస్తే వాళ్లు మనదగ్గరకు వచ్చి సమస్యలను చెప్పుకోవలసి ఉంటుంది. అదే పాదయాత్ర అయితే, నడిచిపోయేటప్పుడు ఆ గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, బాధల్లో ఉన్నారా, వారి ఇబ్బందులేమిటి? అని నేరుగా కలిసి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టే రాజకీయ నేతలు పాదయాత్ర చేస్తుంటారు
వైఎస్‌ఆర్, చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్ పాదయాత్ర గురించి మీ అభిప్రాయం?
లోగడ జరిగిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర తప్పకుండా భిన్నంగా ఉంటోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ ఉమ్మడి రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేశారు. అప్పట్లో ప్రతి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని జగన్ చూసినట్లుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే నేత కూడా చూడలేదు. ఇది అతిశయోక్తి కాదు. పేదలు, బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి గుడిసెలోకి వెళ్లారాయన. వాళ్ల కష్టాలు చూశాడు కాబట్టే పాదయాత్రలో మరోసారి వారందరినీ కలుసుకుని ఉన్న సమస్యలను అధికారంలోకి వచ్చాక ఎలా పరిష్కరిద్దాం అని చెబుతున్నారు. ఆ గ్రామానికే పరిమితమై ఉన్న సమస్యలు పాదయాత్ర ద్వారా వెలికి వస్తున్నాయి. పాదయాత్ర ఉద్దేశం అదే.
ఉపఎన్నికల్లో 15 స్థానాలు గెలిచీ, శాసనసభ ఎన్నికల్లో ఎలా దెబ్బతిన్నారు?
ఎన్నికలైన రెండు రోజులకే విశ్లేషించుకున్నాం. మనం పొరపాట్లు చేశామా లేక ప్రత్యర్థి జనాలను మభ్యపెట్టినందుకు ఇలా జరిగిందా, ఇంకేవైనా కారణాలు ప్రభావం చూపాయా అని చర్చించుకున్నాం. ప్రధానంగా రుణమాఫీ. అది సాధ్యం కాదనుకున్నప్పటికీ ఎంతో కొంత చేద్దాం, ప్రకటిద్దాం అనుకున్నాం. వారంరోజులపాటు వాదనలు జరిగాయి. కానీ వైఎస్ జగన్ ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే రాష్ట్రం విడిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు రుణమాఫీ చేసే శక్తి లేదు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సహకరించే అవకాశం ఉంటే అప్పుడు చూడవచ్చు కానీ తప్పుడు వాగ్దానాలు చేయకూడదు అన్నదే జగన్ అభిప్రాయం. ఇక రెండోది. కాంపెయిన్ ప్రారంభించాక 45 రోజుల్లో మోదీ ప్రభం జనం దేశవ్యాప్తంగా ప్రభావం కలిగించింది. దాని ప్రభావం ఏపీలో నగర ప్రాంత నియోజక వర్గాల్లో బాగా పనిచేసింది. దాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయాం. ఎంతమేరకు ప్రభావం వేసిందంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు పట్టణ ప్రాంత నియోజకవర్గాలు 75 ఉండగా, వాటిలో మేం 27 స్థానాలు మాత్రమే గెలవగలిగాం. ఇక మూడోది పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్. అది ఎలా పనిచేసిందన్నది అందరికీ తెలుసు.
పాత అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతున్నారు?
ఏ హామీలిచ్చి బాబు అధికారంలోకి వచ్చారో, వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలుకాలేదు. రుణమాఫీ కాక రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. పండినపంటకు గిట్టుబాటు ధర లేక, మళ్లీ రుణాలు అందక తీవ్ర అగచాట్లు పడుతున్నారు. 2004కు ముందు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో అవే ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి. 2004కి ముందు నాలుగేళ్లపాటు కరువు విలయతాండవం చేసింది. రైతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణం. ఈరోజు రైతులు అదే పరిస్థితుల్లో ఉన్నారు. కరువు వల్ల పంటలు పండింది లేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.
రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది కదా?
మహిళలు, రైతులు, యువకులు ఎవరిలో సంతృప్తి ఉందో వెళ్లి చూస్తే స్పష్టమవుతుంది. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ జరిగిందేమిటి? పాదయాత్రలో ప్రతి గ్రామం నుంచి వాళ్లే వచ్చి చెబుతున్నారు.
ప్రత్యేక హోదా ముగిసిన అంశమని టీడీపీ, బీజేపీ నేతలు అంటున్నారే?
బీజేపీకీ, బాబుకు ప్రత్యేక హోదా ఒక ముగిసిన అంశం కావచ్చు కానీ, 5 కోట్ల ఏపీ ప్రజల దృష్టిలో, మా దృష్టిలో ప్రత్యేక హోదా ఎప్పటికైనా సాధించాల్సిందే. ప్రత్యేక హోదా లేనిదే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అదే లేకపోతే విభజన చట్టానికి ఇక అర్థమే లేదు.
ఎన్నికష్టాలు వచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని బాబు అంటున్నారు కదా?
పోలవరం ఎవరి ప్రాజెక్టు? అది రాష్ట్ర ప్రాజెక్టా లేక కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టా? విభజన చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును మీరు తీసుకోవడం ఏమిటి? ఆ కాంట్రాక్టరును మార్పించడం కోసం మళ్లీ కేంద్రం చుట్టూ తిరగటం ఏమిటి? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రం దాన్ని తీసుకోవలసిందే. లేదా కేంద్రం పూనుకుని రాష్ట్ర ప్రభుత్వం చేత చేయించాల్సిందే.
ప్రాజెక్టుల నిర్వహణలో వైఎస్సార్, చంద్రబాబు మధ్య తేడా ఏమిటి?
గత మూడున్నరేళ్లుగా బాబు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారు? రాష్ట్రంలో సాగుతున్న ప్రాజెక్టులన్నీ గతంలో వైఎస్సార్ చేపట్టినవే. అన్ని అనుమతులూ తీసుకొచ్చి మరీ వాటికి ఒక రూపం ఇచ్చారాయన. మరి బాబు చేసిందేమిటి? పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేశారని చెబుతున్నారు. ఎవరు తవ్విన కాలువలనుంచి దానికి నీళ్లు వచ్చాయో చెబుతారా? వైఎస్సార్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు కల్పించడం కోసం కాలువలను తవ్విస్తున్నారు అని గతంలో బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ అభియోగాలన్నింటికీ ప్రాజెక్టు సైట్‌లోనే చర్చలు పెట్టి వైఎస్ సమాధానం చెప్పారు. ఇంజనీర్ల సమక్షంలో, అఖిల పక్షాన్ని పిలిచి మరీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు అఖిల పక్షం కాదు కదా ప్రధాన ప్రతిపక్షాన్నే ఉనికిలో లేకుండా చేయాలంటున్నారు. కేవలం రెండేళ్ల కోసం 1,600 కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ప్రాజెక్టును కట్టారు. పోలవరం పూర్తయితే అది ఎందుకు పనికొస్తుంది? కమీషన్ల కోసం కాకపోతే ఈ డ్రామాలన్నీ ఎందుకు? పైపులేసి, మోటర్లు పెట్టి దాన్ని నదుల అనుసంధానం అంటారా?
వైఎస్సార్సీపీ అభివృద్ధికి అడ్డుపడుతోందా?
అభివృద్ధికి కాదు... బాబు చేస్తున్న దోపిడీకి అడ్డుపడుతున్నాం. మేమంతా కేంద్రానికి రిపోర్టు చేసి ఏ పని కూడా కాకుండా చేస్తున్నామట. పేదలకు అందాల్సిన జాతీయ నిధులు వారికి అందలేదని మా దృష్టికి వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకుపోయాం. ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరి గిందో ఉదాహరణలతో సహా వివరించాం. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పాం తప్పితే ఆ పథకాలనే ఆపేయమని ఎక్కడా చెప్పలేదు. చెప్పిన అబద్ధమే పదిసార్లు చెబితే జనం నమ్ముతారు అనే దాన్ని తండ్రీ కొడుకులు ఇద్దరూ పట్టుకుని సాగదీస్తున్నారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా లోకేశ్ కూడా తయారయ్యాడు.
వచ్చే ఎన్నికల్లో మీ విజయావకాశాలు ఏమేరకున్నాయి?
ప్రజలు ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు ఇస్తారు. గత ఎన్నికల్లో కేవలం 1.7 శాతం తేడాతో అంటే 5 లక్షల 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అభ్యర్థులనే రంగంలోకి దింపుతాం. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే చంద్రబాబు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు. పాలన పక్కన బెట్టేశారు. కుటుంబ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అభివృద్ధిని వదిలేశారు. ఇదే మాకు అవకాశం. ఈసారి గెలుస్తాం కూడా.
(వైవీ సుబ్బారెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
Comments
Please login to add a commentAdd a comment