బూత్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో ముదునూరి ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు తదితరులు
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ దురాగతాలతో విసిగిపోయారని, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి బాధలు తెలుసుకోవడానికే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించారని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ గుణ్ణం నాగబాబు అధ్యక్షతన జరిగిన బూత్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీడీపీ అరాచకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలి
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేకే ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాబు పాలనలో జరుగుతున్న అవినీతి, అరాచకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, ప్రజల్లో సర్కారు తీరును ఎండగట్టాలని బూత్‌కమిటీలకుసూచించారు. అలాగే పార్టీ నవరత్న పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత బూత్‌కమిటీలదేనని చెప్పారు.
మోసకారి బాబు
రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన మోసకారి చంద్రబాబు అని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసే చేతకాని ప్రభుత్వం చంద్రబాబుదని విమర్శించారు. పచ్చచొక్కాలకే పథకాలన్నీ అందుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకు సంక్షేమ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నవరత్నాల పథకాలతో రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను మరోసారి గుర్తుచేసుకుంటారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన డ్రామాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
వచ్చే ఎన్నికల్లో బాబుకు అధోగతే
వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ అనుకూల మీడియా వల్లే చంద్రబాబు గత ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగాడన్నారు. అబద్దాన్ని నిజం చేయగలిగే మీడియా ఉంది కాబట్టే అతని ఆటలు సాగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది మోసినా చంద్రబాబు గట్టెక్కే పరిస్థితి లేదన్నారు. గతంలో ఓ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు చిరంజీవిలాంటి వ్యక్తినే పాలకొల్లు ప్రజలు ఓడించారని అటువంటిది ప్రజా వ్యతిరేకత ఉన్న టీడీపీని ఓడించడం పెద్ద సమస్య కాదని అన్నారు.
నవరత్నాలతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు
వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు మాట్లాడుతూ నవరత్నాల పథకాలతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. నవరత్నాలకు తోడుగా ప్రజాసంకల్ప పాదయాత్రతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా బూత్ కమిటీల కన్వీనర్ బీవీఎన్ చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి కుమార దత్తాత్రేయ వర్మ, రెండు పార్లమెంటు జిల్లాల ఎస్సీ సెల్ కో– ఆర్డినేటర్ చెల్లెం ఆనందప్రకాష్, నరసాపురం పార్లమెంటు జిల్లా పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ డీటీడీసీ బాబు, సీనియర్ నాయకులు నడపన సత్యనారాయణ, పాలకొల్లు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment