‘సమ్మక్క-సారక్క’ వెబ్‌సైట్ ప్రారంభం
నేడు సోనియా పేరిట సమ్మక్క, సారక్కలకు నిలువెత్తు బంగారం (బెల్లం): పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంప్రదాయ జాతర ‘సమ్మక్క-సారక్క’కు సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ www.sammakka sarakka.co.in వెబ్‌సైట్‌లో జాతర విశిష్టతను తెలియజేసే చరిత్ర, భక్తుల కోసం గూగుల్ రూట్ మ్యాప్, అత్యవసర ఫోన్ నంబర్లు, జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీసీ బస్‌ల రాకపోకలు తదితర వివరాలను పొందుపరిచినట్లు పొన్నాల చెప్పారు.
జాతర ఏర్పాట్ల కోసం రూ. 100 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 15 వరకు సాగే ఈ జాతరకు కోటి మంది హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు. ‘అడవి చేసే అమ్మల జాతర’ పేరుతో సమ్మక్క సారక్క దేవతలపై 40 వేల పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసినట్లు చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చనున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమ్మక్క సారక్కలకు బుధవారం సమర్పించనున్నట్లు పొన్నాల చెప్పారు.