'ఇచ్చిన మాట నిలబెట్టుకో కేసీఆర్'
హైదరాబాద్: జిల్లా కేంద్రంగా చేస్తానంటూ జనగామ ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామను జిల్లాగా చేస్తానని గత ఎన్నికల సందర్భంగా హామీని ఇచ్చిన కేసీఆర్ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లా కోసం ప్రజలు, అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. జనగామకు సాంకేతికంగా, శాస్త్రీయంగా, పరిపాలనాపరంగా, భౌగోళికంగా, వనరులు, విస్తీర్ణం వంటి వాటిలో జిల్లా అయ్యే అన్ని అర్హతలున్నాయని పొన్నాల అభిప్రాయపడ్డారు.