ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు..
సాక్షి, జనగామ : ముందస్తు ఎన్నికలకు సై అంటూ సంకేతాలు ఇస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోసారి అధికారమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్న ‘గులాబీ’ బాస్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులను ప్రకటించే ఆనవాయితీకి స్వస్తి చెప్పి.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీలో ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక కోసం చేస్తున్న సన్నాహాలు రాజకీయంగా ఉత్కంఠను రేపుతున్నాయి.
టికెట్ల ఖరారుకు రహస్య సర్వే..
టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్ల ఖరారు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రహస్యంగా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై పలు దఫాలుగా సర్వేలు చేయించారు. ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందనే కోణంలో సర్వేలు చేయించి బహిర్గత పర్చారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికల కోసం సిద్ధపడుతున్న కేసీఆర్ సమర్థులైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఆశావహుల పేర్లతో జాబితాను తయారు చేసి ప్రజల అభిప్రాయాన్ని రహస్యంగా సేకరిస్తున్నారు. సిట్టింగ్‌లకే సీట్లు అని చెప్పినప్పటికీ.. కొంతమంది ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత వంటి విమర్శలున్నాయి. దీంతో వారికి టికెట్లు ఇస్తే ఓడిపోతారనే ప్రచారం కారణంగా ఆశావహుల పేర్లతో కూడా సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రజా మద్దతును బట్టే ఖరారు..
రహస్యంగా కొనసాగుతున్న సర్వే ఆధారంగానే రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో సర్వే ఫలితాలను బట్టే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలో ప్రజలు ఎక్కువగా మద్దతు ఇచ్చే వారికే టికెట్ వరించే పరిస్థితి ఉంది. సిట్టింగ్‌లకు మద్దతు తెలపకపోతే కొత్త వారికి అవకాశాలు కల్పించే ఆలోచన జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికీ.. రహస్య సర్వే ఇటు సిట్టింగ్‌లలోను అటు ఆశావహుల్లోను టెన్షన్ పెట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment