కరువును పారదోలుతాం: కడియం
జనగామ: రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తాగు, సాగు నీరందించి కరువును పాదదోలుతామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జిల్లాలోని జనగామ మండలం చీటకోడూరు నాగులకుంట చెరువు వద్ద మిషన్ కాకతీయ ఫేజ్-3 పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జనగామ ప్రాంతం సుభిక్షంగా మారిందన్నారు. జనగామలో గోదావరి నదీ జలాలతో చెరువులు నింపిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
జిల్లాలో 267 గ్రామాలకుగాను 250 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జనగామ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ 3 మండలాలకు కేజీవీబీ పాఠశాలలు మంజూరు అయినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ 3, 4వ విడతలో మిగిలిన అన్ని చెరువులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, కలెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.