నేడు పొన్నాల పర్యటన
సాక్షి, హన్మకొండ :తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లాలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఆదివారం ఒకేరోజు భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో హెలి కాప్టర్ ద్వారా పర్యటించనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ఉదయం హెలికాప్టర్‌లో భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రం బాంబులగడ్డ వద్దదిగి పట్టణంలో ఎన్నికల ప్రచారం సభలో పాల్గొం టారు.
అక్కడి నుంచి పరకాల నియోజకవర్గం గీసుగొండ మండల కేంద్రానికి చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం ఇదే మండలంలోని ఇల్లందకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీకి చేరుకుని రోడ్డు మార్గంలో కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కల్యాణి పంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ సభలో మాట్లాడతారు. ఈ మేరకు స్థానిక నియోజకవర్గాల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
‘దొంతి’ సస్పెన్షన్
నర్సంపేట నియోజకవర్గంలో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొంతి మాధవరెడ్డిని కాంగ్రెస్ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాధవరరెడ్డికి మొదటి జాబితాలో టిక్కెట్ కేటాయించిన పార్టీ తర్వాత వెనక్కితీసుకుంది. దీంతో మాధవరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన డీసీసీ అధ్యక్షపదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీ నామా ఇంకా పీసీసీగానీ, డీసీసీగానీ చేరకపోవడం తో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.