రైతులకు కరెంటు ఇవ్వకపోగా.. లాఠీదెబ్బలా
విద్యుత్ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆందోళన చేస్తున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు కరెంట్ ఇవ్వడంపై దృష్టి సారించకుండా వారిపై లాఠీఛార్జ్ చేయించడం అమానుషమని ఆయన మండిపడ్డారు. రైతులకు భరోసా ఇవ్వాలని కోరిన ప్రతిపక్షాలను కేసీఆర్ విమర్శించడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లోనే 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ సర్కార్ మానవత్వం లేకుండా రైతులపై రాక్షతత్వాన్ని ప్రదర్శిస్తోందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, వాటిని ఎలా అమలు చేయాలో ఆలోచించకుండా మళ్లీ వేల కోట్ల రూపాయల హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.