lathicharge on farmers
-
స్థానికులు కాదు గూండాలు; వెళ్లేది లేదు!
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం కొనసాగాయి. సింఘు, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భారీగా రైతులు మొహరించారు. ప్రభుత్వం శాంతియుతమైన తమ ఆందోళనను ధ్వంసం చేయాలని యత్నిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ప్రజలంతా తమకు మద్దతునివ్వాలని, జనవరి 30ని సద్భావనా దివస్‌గా పాటించాలని కోరారు. గాంధీ వర్ధంతైన ఆ రోజున ఉదయం 9– సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. సింఘు వద్ద స్థానికులుగా చెప్పుకుంటున్న సమూహానికి, రైతులకు మధ్య జరిగిన సంఘర్షణ పోలీసులు భాష్పవాయువు ప్రయోగించే స్థాయికి చేరింది. మరోవైపు ఘాజీపూర్‌లోని యూపీగేట్ వద్ద బీకేయూ నిరసనలు కొనసాగాయి. రైతు ఆందోళనకు ఆర్ఎల్డీ మద్దతు తెలిపి మహాపంచాయత్‌లో పాల్గొంది. కొత్త చట్టాలను బుట్టదాఖలు చేయకుంటే ఆందోళన మరింత విస్తృతమవుతుందని కాంగ్రెస్ హెచ్చరించింది. రిపబ్లిక్‌డే రోజు జరిగిన హింసాత్మక కార్యక్రమాలపై విచారణ చేస్తున్న పోలీసులు విచారణకు సహకరించాలని తికాయత్ సోదరులు సహా 9మంది రైతు నేతలను కోరారు. రైతులతో స్థానికుల గొడవ రైతుల ట్రాక్టర్ పరేడ్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ స్థానికులుగా చెప్పుకుంటున్న కొందరు కర్రలతో వచ్చి సింఘును ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయని పోలీసులు చెప్పారు. వీరంతా స్థానికులు కాదని, గూండాలని రైతు నాయకులు ఆరోపించారు. వీరు తమపై పెట్రోల్ బాంబులు, రాళ్లు రువ్వారని, తమ ట్రాలీలను కాల్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాము వీరి దుశ్చర్యలను అడ్డుకున్నామని, సమస్య తేలేవరకు సింఘును విడిచిపోమని స్పష్టం చేశారు. కాగా, సింఘు సరిహద్దు వద్ద రైతు నిరసన జరుగుతున్న ప్రాంతంలో ఒక వ్యక్తి కత్తితో చేసిన దాడిలో ఎస్హెచ్ఓ గాయపడారు. యూపీ గేట్ వద్ద ఆగని నిరసన యూపీ గేట్ పరిసరాలను ఖాళీ చేయాలన్న స్థానిక మెజిస్ట్రేట్ ఉత్తర్వును ధిక్కరిస్తూ వందలాదిమంది బీకేయూ(భారతీయ కిసాన్ యూనియన్) సభ్యులు యూపీగేట్ వద్దకు చేరుకుంటున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు స్థానిక ప్రభుత్వం కరెంట్ కోతతో సహా పలు యత్నాలు చేస్తోంది. ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే నిరసన ప్రదేశాన్ని సందర్శించి..ఆర్ధరాత్రి కల్లా స్థలాన్ని ఖాళీ చేయాలనిమౌఖికంగా ఆదేశించారు. ఎర్రకోటపై మతపరమైన జండా ఎగరవేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ ..నిజాలను బయటపెట్టేందుకు కొంత సమయం కావాలని, విచారణకు సహకరిస్తానని ఫేస్బుక్లో ఒక వీడియోను పోస్టు చేశాడు. ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్ నిర్వహించారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను స్థానిక ప్రభుత్వాలు ఖాళీ చేయిస్తాయన్న ఆందోళన నడుమ ఈ మహాపంచాయత్ జరిగింది. ఘాజీపూర్‌లోని యూపీ గేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నవారికి మద్దతుగా వందల ట్రాక్టర్లపై వేలాదిమంది మువ్వన్నెల జెండాలతో సదస్సుకు హాజరయ్యారు. అన్నా దీక్ష... అంతలోనే విరమణ! ముంబై: సాగు చట్టాలకు శనివారం నుంచి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే(84) శుక్రవారం ప్రకటించారు. అయితే గంటల వ్యవధిలోనే దీక్ష యత్నాలను విరమిస్తున్నానని, తన డిమాండ్లలో కొన్నింటికి కేంద్రం అంగీకరించిందని మరో ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో తన దీక్ష ఆరంభమవుతుందని తొలుత ఆయన వెల్లడించారు. కొన్ని గంటల అనంతరం మరో ప్రకటన చేస్తూ ‘‘కొన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. అందువల్ల ఆమరణ దీక్షను పక్కనపెడుతున్నాను.’’ అని చెప్పారు. బాష్పవాయువును ప్రయోగిస్తున్న పోలీసులు ఘాజీపూర్‌లో పోలీసుల బారికేడ్లు -
బ్రేకింగ్: రైతులపై విరిగిన లాఠీలు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు ప్రవేశించారు. ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వాటన్నింటిని దాటి ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగం, నీటి ట్యాంకులతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బారికేడ్లు పెట్టినా రైతులు వాటిని నెట్టివేసి వస్తున్నారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు ట్రాక్టర్ పరేడ్ చేపట్టాలని పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉదయం 8 గంటల నుంచే ఆందోళన మొదలుపెట్టారు. సరిహద్దులు దాటి ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విధంగా రైతులు దూసుకు వస్తుండడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దీంతో సింఘు, టిక్రీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ జెండాలు పట్టుకుని రైతులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సరిహద్దు దాటి రైతులు ట్రాక్టర్లపై ఢిల్లీలోకి ప్రవేశించారు. పాండవ్ నగర్ దగ్గర్లో ఢిల్లీ, మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై బారికేడ్లను రైతులు తొలగించారు. ముకర్బా చౌక్‌లో పోలీసుల వాహనంపై రైతులు కదం తొక్కారు. సంజయ్‌గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులకు పూలస్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఓ బస్సును ధ్వంసం చేశారు. సరిహద్దుల్లో భారీగా రైతులు ట్రాక్టర్ పరేడ్‌లో భాగంగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. అన్ని మార్గాల నుంచి రైతులు ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దులు రైతులతో నిండిపోయాయి. వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు పెట్టినా ధ్వంసం చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. నీళ్ల ట్యాంక్‌లతో రైతులను అడ్డగించారు. బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసం ట్రాక్టర్లు రాకుండా బస్సులను అడ్డంగా పెట్టగా రైతులను వాటిని పక్కకు తోసేశారు. ఈ సందర్భంగా అడ్డొచ్చిన పోలీసులకు కర్రలు పట్టుకుని ఎదురుదాడి చేశారు. ఢిల్లీ వెళ్లే మార్గంలో కనిపించిన పోలీస్ వాహనాలు, బస్సులను రైతులు ధ్వంసం చేశారు. #WATCH Visuals from ITO in central Delhi as protesting farmers reach here after changing the route pic.twitter.com/4sEOF41mBg — ANI (@ANI) January 26, 2021 Did any channel aired this? Stop blaming only farmers. This has also happened today. pic.twitter.com/TDC3FVwiFM — Ravi Nair (@t_d_h_nair) January 26, 2021 -
ముగిసిన కిసాన్ యాత్ర
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి దేశరాజధాని ఢిల్లీ వరకూ తమ సమస్యల పరిష్కారానికి రైతులు చేపట్టిన ‘కిసాన్ క్రాంతి యాత్ర’ బుధవారం ముగిసింది. ఈ యాత్రను యూపీ–ఢిల్లీ సరిహద్దులో పోలీసులు మంగళవారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ముందుకు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వాటర్ కేనన్లు, భాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 12.30 గంటలకు రైతులను ఢిల్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో దాదాపు 70 వేల మంది రైతన్నలు తమ ట్రాక్టర్లతో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్మృతివనమైన ‘కిసాన్ ఘాట్’కు చేరుకున్నారు. అక్కడ చరణ్ సింగ్‌కు నివాళులు అర్పించిన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. -
రైతులకు కరెంటు ఇవ్వకపోగా.. లాఠీదెబ్బలా
విద్యుత్ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆందోళన చేస్తున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు కరెంట్ ఇవ్వడంపై దృష్టి సారించకుండా వారిపై లాఠీఛార్జ్ చేయించడం అమానుషమని ఆయన మండిపడ్డారు. రైతులకు భరోసా ఇవ్వాలని కోరిన ప్రతిపక్షాలను కేసీఆర్ విమర్శించడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లోనే 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ సర్కార్ మానవత్వం లేకుండా రైతులపై రాక్షతత్వాన్ని ప్రదర్శిస్తోందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, వాటిని ఎలా అమలు చేయాలో ఆలోచించకుండా మళ్లీ వేల కోట్ల రూపాయల హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.