రాజధానిలో ఐటీ ప్రాంగణాలు ! : మంత్రి పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్, గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీలు అంగీకరించాయని, దీనివల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంస్థలు అమెరికా వెలుపల మొట్టమొదటి క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే నిర్మించేందుకు అంగీకరించాయని ఆయన చెప్పారు. అమెజాన్ ఇంటర్నేషనల్ కంపెనీ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో 2005 ఆగస్టు 11న అవగాహన కుదుర్చుకుంది.
దీంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నానక్‌రామ్‌గూడలో 10.57 ఎకరాలను ఆ కంపెనీకి కేటాయించింది. ఆ సంస్థ మొత్తం డబ్బును చెల్లించినా కోర్టు వివాదం వల్ల ఏపీఐఐసీ స్థలం అప్పగించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పుణే, ముంబైలలో ప్రాంగణాల ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించింది. దీంతో ఐటీ శాఖ మంత్రి ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఇక్కడే క్యాంపస్ నిర్మించాలని,అవసరమైన అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.మంత్రి హామీతో క్యాంపస్‌లను ఇక్కడే నిర్మించేందుకు ఆ సంస్థల ప్రతినిధులు అంగీకరించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 76 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి పొన్నాల పేర్కొన్నారు.
గూగుల్‌కు ప్రత్యామ్నాయ స్థలం
గూగుల్ కంపెనీకి హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కోర్టు వివాదం వల్ల గతంలో కేటాయించిన స్థలం అప్పగించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో గూగుల్ ఇక్కడే క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని మంత్రి వివరించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని తెలిపారు.